India vs Australia T20:  ప్రపంచకప్‌(World Cup)  ముగిసిన తర్వాత టీమిండియా(Team India) ఆస్ట్రేలియా(Austrelia)తో టీ 20 (T20)సమరానికి సిద్ధమైంది. టీ 20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు.. నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ 20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. వైజాగ్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై తొలి టీ 20 మ్యాచ్‌లో విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌ పైనల్లో ఎదురైన పరాజయానికి కాస్తైన మరుగున పడేయాలని సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టు కోరుకుంటోంది. తనకు ఇష్టమైన ఫార్మాట్‌లో విధ్వంసం సృష్టించేందుకు సూర్య సిద్ధంగా ఉన్నాడు. జట్టు కెప్టెన్‌గా, ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది. 

 

వచ్చే ఏడాది జూన్‌లో టీ 20 ప్రపంచకప్‌ జరగనుంది. దీనికి సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని  టీమిండియా భావిస్తోంది. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లతో టీమిండియాలో యువ రక్తం ఉరకేలేస్తోంది.  రింకూసింగ్‌ టీ 20 క్రికెట్‌లో రాణిస్తూ భవిష్యత్తు తారగా అంచనాలు పెంచేస్తున్నాడు. యశస్వి, తిలక్, ముఖేష్‌, జితేష్, ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.  ప్రపంచ కప్‌లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకోరు. 

 

తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్  మార్గ నిర్దేశనంలో టీమిండియా యువ జట్టు పోరాడనుంది. రుతురాజ్ గైక్వాడ్‌కు తోడుగా యశస్వి జైస్వాల్ ,ఇషాన్ కిషన్‌లలో ఒకరు టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. జైస్వాల్, కిషన్ ఇద్దరినీ ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.  జైస్వాల్, కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్‌, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ఇలా ఏడుగురు లెఫ్‌ హ్యాండ్‌ బ్యాటర్లు జట్టులో ఉన్నారు.

 

అయితే బౌలర్లు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. రవి బిష్ణోయ్‌కు ఈ సిరీస్ నిజమైన పరీక్షగా మారనుంది. ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఎలా ఆడతారో చూడాలి. టీమిండియాకు ఆస్ట్రేలియాతో సిరీస్‌ నిజమైన పరీక్షగా మారనుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వంటి వారి ప్రపంచ కప్ హీరోల ముందు వీరు ఏ మాత్రం నిలబడగలరో చూడాలి. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్ వంటి కీలక ఆటగాళ్లతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. కేన్ రిచర్డ్‌సన్, నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌లతో కూడిన ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ భిన్నంగా ఉంది.

 

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ , ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌.

 

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.