3 Indian Batters Scored 3 Cetnturies VS Wi in 1st Test : బ్యాటర్లు సెంచరీలతో పండుగా చేసుకోవడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆటముగిసేసరికి 128 ఓవర్లలో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (197 బంతుల్లో 100, 12 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (210 బంతుల్లో 125, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (176 బంతుల్లో 104 బ్యాటింగ్, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. ప్రస్తుతం జడేజాతో కలసి వాషింగ్టన్ సుందర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓవరాల్ గా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ రోజు మొత్తం మీద సెషన్ కు ఒక వికెట్ చొప్పున కేవలం మూడు వికెట్లను మాత్రమే భారత్ కోల్పోవడం విశేషం. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
రాణించిన గిల్.. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 121/2 తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. ముఖ్యంగా రాహుల్, శుభమాన్ గిల్ (100 బంతుల్లో 50, 5 ఫోర్లు) జోడీ ప్రత్యర్థి బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంది. వీరిద్దరూ చకచకా పరుగులు సాధించింది. ఈ క్రమంలో 94 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గిల్.. రివర్స్ స్వీప్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్ కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే మరో ఎండ్ లో జోరు కొనసాగించిన రాహుల్.. లంచ్ విరామనికి ముందు టెస్టుల్లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్ తర్వాత కాసేపటికే రాహుల్ ఔటయ్యాడు.
జురేల్, జడేజా జోడీ జోరు..భారత ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జురేల్, జడేజా జోడీ నమోదు చేసింది. లంచ్ విరామం నుంచి దాదాపు రోజు ఆఖరు వరకు బ్యాటింగ్ చేసిన ఈ జంట 5వ వికెట్ కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఓ ఎండ్ లో జురేల్ సమయోచితంగా ఆడగా, జడేజా వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తొలుత 190 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికి తను ఔటయ్యాడు. ఇక మరో ఎండ్ లో జడేజా కూడా కెరీర్లో 6వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆఖరికి వాషింగ్టన్ సుందర్ తో కలసి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. మిగతా బౌలర్లలో జైడెన్ సీల్స్ , జోమెల్ వారికన్, ఖారీ పిర్ కు తలో వికెట్ దక్కింది. భారత్ కు భారీ ఆధిక్యం దక్కిన నేపథ్యంలో మ్యాచ్ మూడో రోజైన శనివారం ముగిసే అవకాశముంది.