Team India Records: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో స్టోక్స్ సేనపై ఏకంగా 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. బర్మింగ్ హామ్ వేదికపై తొలి విజయాన్ని సాధించిన టీమిండియా.. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. అలాగే సేనా దేశాల్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇప్పటివరకు సేనా దేశాల్లో భారత్ సాధించిన టాప్ 5 విజయాలను చూసినట్లయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో రెండేసి చొప్పున విజయాలు సాధించింది. అలాగే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లేకుండా ఇంత పెద్ద విజయం సాధించడంపై భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడో టెస్టులోబుమ్రా అందుబాటులోకి రావడం, ఆకాశ్ దీప్ తో చేరికతో భారత బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందని పేర్కొంటున్నారు.
సేనా దేశాల్లో భారత్ టాప్ 5 విజయాలు.. ఇప్పటివరకు భారత్ సాధించిన టాప్ 5 విజయాలను సాధించినట్లయితే బర్మింగ్ హామ్ లో సాధించిన 336 పరుగులే అతి పెద్ద గెలుపుగా నిలిచింది. ఆ తర్వాత స్థానం గతేడాది పెర్త్ లో ఆస్ట్రేలియాపై సాధించిన 295 పరుగుల విక్టరీ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 1986లో లీడ్స్ వేదికపై ఇంగ్లాండ్ పై సాధించిన 279 పరుగుల గెలుపు నిలిచింది. న్యూజిలాండ్ పై 1968లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ సాధించిన 272 పరుగుల విక్టరీ తర్వాతి స్థానాన్ని సాధించింది. ఇక మెల్ బోర్న్ వేదికగా 1997లో ఆస్ట్రేలియాపై సాధించిన 222 పరుగుల విజయం టాప్- 5వ స్థానం దక్కించుకుంది.
ఈ శతాబ్దంలో చారిత్రాత్మక విజయాలు..2000కి ముందు భారత జట్టు పరిస్థితి వేరేగా ఉంది. పైపర్ టైగర్ మాదిరిగా పరిగణించేవారు. స్వదేశంలో మాత్రమే గెలిచి, విదేశాల్లో చతికిల పడే జట్టుగా ముద్ర ఉండేది. ఇక 2000 నుంచి టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లలో టెస్టు సిరీస్ విజయాలు అందులో ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. ఇక 2000 నుంచి సేనా దేశాల్లో భారత్ సాధించిన విజయాలు చూసినట్లయితే మరే ఇతర ఆసియా జట్టు ఇలాంటి విజయాలు సాధించలేదు. దీంతో కొన్ని చారిత్రాత్మక విజయాలు సాధించిన ఆసియా జట్టుగా నిలిచింది. వాటిని పరిశీలించినట్లయితే.. 2008, 2018లో పెర్త్ లో గెలిచి, ఈ వేదికపై విజయం సాధించిన ఏకైక ఆసియా జట్టుగా నిలిచింది. అలాగే 2021లో బ్రిస్బేన్, సెంచూరియాన్ లో గెలిచి, ఈ ఘనత సాధించిన ఏకైక ఆసియ జట్టుగా రికార్డులకెక్కింది. తాజాగా తన ఘనతను మరింత మెరుగుపర్చుకుంటూ, ఆసియా జట్లకు కొరకరాని కొయ్యగా నిలిచిన బర్మింగ్ హామ్ వేదికపై గెలిచి, మరోసారి చరిత్ర సృష్టించింది.