Prasidh krishna out from Lords Test against England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జూలై 10న లార్డ్స్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ కీలక టెస్టు మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్టార్ పేసర్ బుమ్రా జట్టులో చేరాడంటే ఒక బౌలర్‌ను తొలగించనున్నారు. వాస్తవానికి బుమ్రా స్థానంలో యంగ్ పేసర్ ఆకాష్ దీప్ రెండవ టెస్ట్‌లో జట్టులో చేరాడు. కానీ అద్భుతమైన బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్ జట్టులో తన స్థానం కన్ఫామ్ చేసుకోనున్నాడు. అదే సమయంలో ఏ మాత్రం రాణించని, రెండు టెస్టుల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన ప్రసిద్ధ్ కృష్ణపై మేనేజ్ మెంట్ వేటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ప్రసిద్ధ్ కృష్ణ పేలవమైన ప్రదర్శన

భారత జట్టు మొదటి టెస్ట్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా ఫాస్ట్ బౌలర్‌లు ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు తీస్తాడని అభిమానులు  ఆశించారు. అతడు ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నాడు. కానీ టీమిండియాలో చేరాక ఇంగ్లాండ్ పర్యటనలో తన బౌలింగ్‌తో అందరినీ నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో వికెట్ తీశాడు, కానీ చాలా పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అదే సమయంలో రెండవ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. చాలా పరుగులు ఇచ్చాడు.

ప్రసిద్ధ్ కృష్ణ మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల తరహాలో 6.40 రన్ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అతను 2 వికెట్లు తీశాడు, కానీ 6 కంటే ఎక్కువ రన్ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. రెండవ టెస్ట్‌లో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతను 5 కంటే ఎక్కువ రన్ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

ఆకాష్ దీప్ అద్భుతమైన ప్రదర్శన

లార్డ్స్ టెస్ట్‌లో స్టార్ పేసర్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం దాదాపు ఖాయం. అలాంటి పరిస్థితిలో రెండవ టెస్ట్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆకాష్ దీప్‌ను మూడో టెస్టులో కొనసాగించవచ్చు. దాంతో ప్రసిద్ధ్ కృష్ణ లార్డ్స్ టెస్టులో జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది. ఆకాష్ దీప్ రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 ముఖ్యమైన వికెట్లు తీశాడు. అదే విధంగా రెండవ ఇన్నింగ్స్‌లో కూడా వేగంగా రెండు వికెట్లు తీశాడు. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో భారత్ తొలి విజయానికి మహ్మద్ సిరాజ్ తో కలిసి బాటలు వేశాడు. ఒకవేళ ఆకాశ్ దీప్ నుంచి సిరాజ్ కు సహకారం అందకపోతే భారత్ రెండో టెస్టులోనూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది.