Akashdeep Superb Bowling: బర్మింగ్ హామ్ కోట బద్దలైంది. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఇక్కడ ఆడిన భారత్ కు భంగపాటే ఎదురవగా, తొమ్మిదోసారి విజయం సాధించింది. ఆదివారం ఐదోరోజు ఇంగ్లాండ్ ని త్వరగా ఔట్ చేసి, ఘన విజయం సాధించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 72/3 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 337 పరుగులతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ (99 బంతుల్లో 88, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆకాశ్ దీప్ కెరీర్ ఉత్తమ బౌలింగ్ (6/99)తో టాప్ వికెట్ టేకర్ గా నిలిచి, ఓవరాల్ గా 10 వికెట్లతో రాణించాడు. ఈ గెలుపుతో ఈ వేదికపై విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.
ఆకాశ్ దీప్ అదుర్స్..అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పదే పదే లోపలికి వస్తున్న బంతులకు ఇబ్బంది పడుతున్న ఒల్లీ పోప్ (24) ని ఆకాశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఐదోరోజు తొలి వికెట్ ను భారత్ సాధించింది. ఆ తర్వాత విధ్వంసక బ్యాటర్ హేరీ బ్రూక్ (6) ని కూడా అద్భుత బంతితో ఎల్బీ చేసిన ఆకాశ్.. ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. అంతకుముందు వర్షం పడటంతో దాదాపు గంటన్నరపాటు ఆలస్యంగా మ్యాచ్ స్టార్టయ్యింది. ఇక బ్రూక్ వికెట్ పడ్డాకా కెప్టెన్ బెన్ స్టోక్స్ (33) తో కలిసి స్మిత్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆరో వికెట్ కి 70 పరుగులు జోడించాక లంచ్ విరామానికి ఒక్క ఓవర్ ముందు వాషింగ్టన్ సుందర్.. అద్భుత బంతితో స్టోక్స్ ను ఎల్బీగా ఔట్ చేశాడు.
తొలి ఫైఫర్..తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించి, ఇంగ్లాండ్ నడ్డి విరిచిన ఆకాశ్ దీప్.. రెండో ఇన్నింగ్స్ లో తన తొలి ఫైఫర్ ను నమోదు చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో జోరు చూపించిన స్మిత్ ను స్లో బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. అంతకుముందు క్రిస్ వోక్స్ (7)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ కు పంపాడు. ఆఖర్లో టెయిలెండర్ బ్రైడెన్ కార్స్ (38) కాసేపు బ్యాటింగ్ చేయడంతో భారత విజయం కాసేపు ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో 180 పరుగుల ఆధిక్యం భారత్ కు లభించగా, రెండో ఇన్నింగ్స్ ను 426/7 వద్ద డిక్లేర్ చేసి, 608 పరుగుల భారీ టార్గెట్ ను ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో టెస్టు లార్డ్స్ మైదానంలో ఈనెల 10 నుంచి జరుగుతుంది. ఈ విజయంతో తన రెండో టెస్టులోనే గెలుపును శుభమాన్ గిల్ రుచి చూసినట్లయ్యింది.