Ind Vs Eng 2nd Test Day 3 Live Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను ఆలౌట్ త్వరగా చేసి, భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత్... రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసేసరికి 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ 180 పరుగుల ఆధిక్యం కలుపుకుని, ఓవరాల్ గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేెఎల్ రాహుల్ (28 బ్యాటింగ్) , కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (6/70), ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో రాణించారు.
ధనాధన్ ఆటతీరు.. తొలిఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యం దక్కడంతో హుషారుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఇంగ్లాండ్ బజ్ బాల్ తరహా ఆటతీరును ఆ జట్టుకే రుచి చూపించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (28) , కేఎల్ రాహుల్ వేగంగా ఆడారు. వీరిద్దరూ బౌండరీలతో డీల్ చేస్తూ, వేగంగా పరుగులు చేశారు. దాదాపుగా ఓవర్ కు ఆరు పరుగులకు పైగా రన్ రేట్ తో వేగంగా ఆడారు. అయితే జోరు మీదున్న జైస్వాల్ ను జోష్ టంగ్ ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. దీంతో తొలి వికెట్ కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుమందు జైస్వాల్ టెస్టుల్లో 2వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తను కేవలం 40 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్కును చేరుకున్నాడు. దీంతో అత్యంత వేగవంతంగా ఈ మార్కును చేరుకున్న క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ తదితరుల సరసన చేరాడు.
సిరాజ్, ఆకాశ్ దీప్ మ్యాజిక్..అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 77/3 తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ హేరీ బ్రూక్ (158) శతకంతో కదం తొక్కాడు. నిజానికి ఆరంభంలోనే జో రూట్ (22), కెప్టెన్ బెన్ స్టోక్స్ డకౌట్ తో త్వరగా ఔట్ కావడంతో ఒక దశలో 84/5 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరో వికెట్ కు స్మిత్, బ్రూక్ జోడీ 303 పరుగుల జోడించి జట్టును ఆదుకుంది. వీరిద్దరూ రెండు సెషన్లకు పైగా బ్యాటింగ్ చేసి, అద్భుత పోరాటం చేశాడు. అయితే కొత్త బంతి తీసుకున్నాక ఆకాశ్ దీప్.. బ్రూక్, క్రిస్ వోక్స్ ను ఔట్ చేసి, ఇంగ్లాండ్ పతనానికి దారులు వేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సిరాజ్ మిగతా వారిని ఔట్ చేసి ఇంగ్లాండ్ ను ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. ఇక నాలుగో రోజు టీ విరామం వరకు వేగంగా బ్యాటింగ్ చేసి 450+ పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కు నిర్దేశిస్తే, ఈ మ్యాచ్ భారత్ సొంతమవుతుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది.