Ind Vs Eng 2nd Test Day 3 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 77/3 తో ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 180 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్, 21 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (6/70) ప్రధాన పేసర్ గా ముందుండి జట్టును నడిపించి, హైయ్యెస్ట్ వికెట్లు తీశాడు. ఇప్పటికే వికెట్ క్షీణిస్తుండటంతో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారనుంది. దీంతో వీలైనంత త్వరగా పరుగులు సాధించి, ఇంగ్లాండ్ కాస్త భారీ టార్గెట్ ను నిర్దేశించ గలిగితే, ఇండియాకు విజయం దక్కవచ్చని తెలుస్తోంది.
సూపర్ భాగస్వామ్యం..ఓవర్ నైట్ స్కోరు తో శుక్రవారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు సిరాజ్ డబుల్ షాకిచ్చాడు. ఆట ఆరంభంలోనే జో రూట్ (22), కెప్టెన్ బెన్ స్టోక్స్ ను డకౌట్ చేశాడు. దీంతో 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన స్మిత్.. హేరీ బ్రూక్ (234 బంతుల్లో 158,17 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగి, సత్పలితాన్ని సాధించారు. వికెట్లు కోల్పోయినా వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా స్మిత్ దూకుడుగా ఆడుతూ లంచ్ లోపే 80 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. కాసేపటికే బ్రూక్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత మొత్తం సెషన్ ఆడి, భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. టీ విరామం వరకు బ్యాటింగ్ చేశారు. అయితే ఆరో వికెట్ కు 303 పరుగులు జోడించాక, ఆకాశ్ దీప్ మ్యాజిక్ డెలీవరితో బ్రూక్ ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యానికి తెరదింపాడు..
మియా మ్యాజిక్..స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లేని లోటును పూరిస్తూ, అనుభవం గల బౌలర్ గా సిరాజ్ జట్టును ముందుండి నడిపించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెయిల్ ను త్వరగా పెవిలియన్ కు పంపడంతో భారత్ కు భారీ ఆధిక్యం దక్కింది. అంతకుముందు క్రిస్ వోక్స్ (5)ను ఆకాశ్ దీప్ స్లిప్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్.. వరుసగా బ్రైడెన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ లను డకౌట్లు చేసి ఫైఫర్ తో పాటు ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లోని పది వికెట్లను ఈ ఇద్దరు పేసర్లే తీయడం విశేషం. మరో ఎండ్ లో నాటౌట్ గా నిలిచిన స్మిత్.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ గా రికార్డులకెక్కాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.