Shubman Gill Consecutive Century: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపుపై కన్నేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. ప్రత్యర్థికి 608 పరుగుల అసాధ్యమైన టార్గెట్ ను నిర్దేశించింది. అంతకుముందు శనివారం నాలుగోరోజు ఓవర్ నైట్ స్కోరు 64/1 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 83 ఓవర్లలో ఆరు వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుభమాన్ గిల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ (162 బంతుల్లో 161, 13 ఫోర్లు, 8 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచి, ఇదే టెస్టులో మరోసారి సెంచరీ మార్కును దాటాడు. బౌలర్లలో షోయబ్ బషీర్, జోష్ టంగ్ కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాచ్ లో మరో 110 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో ఇంగ్లాండు ఆరు పరుగుల రన్ రేట్ తో పరుగులు సాధిస్తేనే విజయం సొంతం అవుతుంది. పిచ్ కాస్త పాడైన నేపథ్యంలో ఇది సాధ్యం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఇంగ్లాండ్ డ్రా కోసమే ఆడే అవకాశమే ఉంది.
గిల్ మరో సెంచరీ..తొలి ఇన్నింగ్స్ లో పలు రికార్డులను బద్దలు కొడుతూ సెంచరీ చేసిన గిల్.. మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 64/1 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు షాక్ తగిలింది. ఆరంభంలోనే కరుణ్ నాయర్ (26) , తర్వాత కేఎల్ రాహుల్ (55) కూడా ఫిఫ్టీ తర్వాత ఔట్ కావడంతో ఇండియా కాస్త త్వరగా వికెట్లను కోల్పోయి నట్లయింది.. ఈ దశలో రిషభ్ పంత్ (65) తో కలిసి మరో ఉపయుక్త భాగస్వామ్యాన్ని గిల్ నెలకొల్పాడు. ప్రారంభంలో పంత్ బ్యాట్ ఝళిపించడంతో మూమెంటం మారింది. వేగంగా పరుగులు సాధించడంతో టీమిండియా పైచేయి సాధించింది. ఈ క్రమంలో గిల్, పంత్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత పంత్ ఔట్ కావడంతో నాలుగో వికెట్ కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అదరగొట్టిన జడేజా, గిల్ భాగస్వామ్యం..తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రవీంద్ర జడేజా (69 నాటౌట్), గిల్ జంట మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేసింది. ఈసారి సర్ప్రైజింగ్ గా ఆరో నెంబర్లో బ్యాటింగ్ కు దిగిన జడేజా మరోసారి ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో భారత్ లీడ్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గిల్ ఈ మ్యాచ్ లో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొమ్మిదో క్రికెటర్ గా, రెండో భారత క్రికెటర్ (ఫస్ట్ సునీల్ గావస్కర్) గా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 175 పరుగులు జోడించడంతో ఇండియా పటిష్ట స్థితికి చేరింది. ఆఖర్లో పరుగులు పెంచే క్రమంలో గిల్ తర్వాత నితీశ్ రెడ్డి (1) త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 180 పరుగుల లీడ్ తో కలిపి ఓవరాల్ గా 608 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.