India Vs Australia 4 th Test Updates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్టులో భారత్ ఎదురీదుతోంది. శుక్రవారం బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటముగిసేసరికి 46 ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ (118 బంతుల్లో 82, 11 ఫోర్లు, 1 సిక్సర్)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (86 బంతుల్లో 36, 4 ఫోర్లు) ఓపికగా ఆడగా, కేఎల్ రాహుల్ (24) ఫర్వాలేదనిపించాడు. రెండోరోజు ఆటముగిసే సరికి వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (6), స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లతో సత్తా చాటారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో ఆసీస్ ఈ టెస్టుపై పట్టు బిగించినట్లే కనిపిస్తోంది.






జోరు చూపించిన జైస్వాల్..
భారత ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో తన విలువేంటో చాటాడు. తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడిన జైస్వాల్.. ఒక్కసారి కుదురుకున్నాక మైదానం అన్ని వైపులా షాట్లు కొట్టి అలరించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీతో కలిసి మూడో వికెట్ కు కీలకమైన 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే కోహ్లీతో సమన్వయలోపంతో అన్ లక్కీగా రనౌట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ గా బరిలోకి దిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోసారి విఫలమయ్యాడు. తన వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ, ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.  బాధ్యతారాహిత్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన ఓపెనర్ స్థానంలో కూడా రోహిత్ విఫలం కావడంపై మాజీలు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. రోహిత్ ఔటైన  తర్వాత రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను జైస్వాల్ తీసుకున్నాడు. 


టీ విరామానికి ముందు రాహుల్ ఔట్..
రోహిత్ వెనుదిరిగిన తర్వాత రాహుల్-జైస్వాల్ జంట ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ మంచి టచ్ లో కనిపించాడు. వీళ్లిద్దరూ దాదాపు 13 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే ఈ జంటను కమిన్స్ అద్భుతమైన బంతితో విడదీశాడు. టీ విరామానికి ముందు చక్కని ఔట్ స్వింగర్ తో రాహుల్ ను బోల్డ్ చేశాడు. దీంతో 43 పరుగుల పార్ట్నర్ షిప్ కు తెరపడింది. ఆ తర్వాత కోహ్లీ-జైస్వాల్ జంట జాగ్రత్తగా ఆడింది. 


ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా జైస్వాల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మరోవైపు అప్పటివరకు ఏకాగ్రతగా ఆడిన కోహ్లీ.. మరోసారి తన బలహీనతను చాటుకుంటూ ఆఫ్ స్టంపై కు చాలా దూరంగా వెళుతున్న బంతిని వేటాడి ఔటయ్యాడు. దీంతో ఒక్కపరుగు తేడాతో కోహ్లీ, జైస్వాల్ ఔటయ్యారు. నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ ను బోలాండ్ డకౌట్ చేయడంతో భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 311/6తో బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్.. మరో 163 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మిత్ కెరీర్లో 34వ సెంచరీని చేశాడు. బుమ్రా నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 


Also Read: Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం