Ind vs Eng 5th Test Highlights | కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118 పరుగులు) సెంచరీతో చెలరేగగా, నైట్ వాచ్‌మన్ ఆకాష్‌దీప్ (66 పరుగులు), రవీంద్ర జడేజా (53 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (53 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 5వ టెస్టులో ఇంగ్లండ్‌కు భారత్ 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు వెనుకబడిన తర్వాత, కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది.
టెస్టులో ఓవరాల్‌గా ఇలా..
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ను 247 పరుగులకు కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్, ఆకాష్ దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో భారత్ 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 125 పరుగులకు 5 వికెట్లు తీశాడు. అట్కిన్సన్ 123 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్‌లో క్రిస్ వోక్స్ గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సైతం చేయలేదు.
కెన్నింగ్టన్ ఓవల్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. కీలక సమయంలో రాణించిన జైస్వాల్ కేవలం 127 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో నమోదైన 19వ సెంచరీ ఇది, కాగా టెస్టు చరిత్రలో ఓ సిరీస్ లో నమోదైన సెంచరీల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ పూర్తయితే ఇంకా క్లారిటీ వస్తుంది.
సిరీస్‌లో 19వ సెంచరీతో బిగ్ రికార్డు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 19 సెంచరీలు నమోదయ్యాయి. ఈ సిరీస్‌లో జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ. సిరీస్ లో టీమిండియా తరఫున నమోదైన 12వ సెంచరీ ఇది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో 7 సెంచరీలు చేశారు. సిరీస్ లో అత్యధిక సెంచరీల పరంగా టెస్ట్ క్రికెట్‌లో 3వ స్థానంలో నిలిచింది. 1955లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌లో 21 సెంచరీలు బాదేశారు. 2003-04లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో 20 సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ 19 సెంచరీలతో 3వ స్థానంలో ఉంది.
అరుదైన రికార్డును సమం చేసిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున 12 సెంచరీలు చేశారు. టెస్ట్ చరిత్రలో సిరీస్‌లో ఒక జట్టు 12 సెంచరీలు సాధించడం ఇది కేవలం నాల్గవసారి. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ ల పేరిట ఉంది. ఈ జట్లు ఒక సిరీస్‌లో 12 సెంచరీలు చేశాయి.
1955లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 12 సెంచరీలు చేసింది. 1982-83లో స్వదేశంలో భారత్‌తో ఆడుతూ పాకిస్తాన్ 12 సెంచరీలు సాధించింది. 2003-04లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా 12 సెంచరీలు సాధించింది. ఇప్పుడు భారత్ ఇంగ్లండ్ లో 12 శతకాలు నమోదు చేసి రికార్డు సమం చేసింది.