Ind vs Eng 3rd Test Day 2 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆలౌటయ్యింది. సరిగ్గా ఇంగ్లాండ్ చేసిన స్కోరును సమం చేసి ఆలౌటయ్యింది. శనివారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన ఇండియా.. 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ (177 బంతుల్లో 100, 13ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో క్రిస్ వోక్స్ కు మూడు వికెట్లు దక్కాయి. దీంతో స్కోరు సమంగా నిలవడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఎంత పరుగులు చేస్తే, దానికన్నా ఒక్క పరుగు కలుపుకుని, ఇండియాకు టార్గెట్ గా మారుతుంది. ఇక ఆట చివర్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మూడోరోజు ఆటముగిసేసరికి ఒక్క ఓవర్లో వికెట్ నష్ట పోకుండా 2 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం రెండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
రాహుల్ రికార్డు సెంచరీ..మూడో రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన భారత బ్యాటర్లు రాహుల్ , రిషభ్ పంత్ (112 బంతుల్లో 74, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధికారికంగా ఆడారు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన బ్యాటర్లు గాడిన పడిన తర్వాత బ్యాట్ ఝళిపించారు. ముఖ్యంగా పంత్ రెండు సిక్సర్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ నాలుగో వికెట్ కు 141 పరుగులు నమోదు చేశారు. అయితే ఫిఫ్టీ పూర్తయిన తర్వాత సింగిల్ కు ప్రయత్నించి, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విసిరిన అద్భుతమైన త్రోకు పంత్ రనౌటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రాహుల్ సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో తనకిది పదో సెంచరీ కాగా, లార్డ్స్ మైదానంలో ఇది రెండవది కావడం విశేషం. అయితే సెంచరీ తర్వాత వెంటనే స్లిప్ లో క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు.
సూపర్ జడ్డూ..వెంటవెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో భారత్ కాస్త కష్టాల్లో పడింది. ఈ దశలో వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72, 8 ఫోర్లు, 1 సిక్సర్) తన అనుభవన్నాంత రంగరించి, విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తొలుత తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (30)తో కలిసి ఆరో వికెట్ కు జడ్డూ 72 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదైంది. వీరిద్దరూ చాలా ఓపికగా బ్యాటింగ్ చేసి, కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ పై చేయి సాధించలేక పోయింది. అయితే సెట్ అయ్యాక అద్బుతమైన బంతితో స్టోక్స్ నితీశ్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (23) కూడా జడేజాతో మరో ఉపయుక్త భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ చాలా సంయమనంతో బ్యాటింగ్ చేసి, ఎనిమిదో వికెట్ కు కరెక్టుగా 50 పరుగులు జోడించడంతో ఇండియా ఆధిపత్యం సాధిస్తుందనిపించింది. అయితే అయితే జడేజా ఔటైన తర్వాత లోయర్ ఆర్డర్ మరోసారి కుప్పుకూలడంతో 387 పరుగులకు ఇండియా ఆలౌటైంది. మిగతా బౌలర్లో జోఫ్రా ఆర్చర్, స్టోక్స్ కు రెండేసి వికెట్లు దక్కాయి.