IND W vs UAE W:  అమ్మాయిల అండర్ 19 ప్రపంచకప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ ను గెలిచిన టీమిండియా అమ్మాయిలు రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించారు. సోమవారం జరిగిన గ్రూప్- డీ మ్యాచ్ లో యూఏఈ జట్టుని 122 పరుగుల తేడాతో ఓడించారు. 


మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు షెఫాలి వర్మ (34 బంతుల్లో 78), శ్వేత సహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు కేవలం 8.3 ఓవర్లలోనే 111 పరుగులు జోడించారు. కెప్టెన్ షెఫాలీ వర్మ యూఏఈ  బౌలింగ్ ను ఉతికారేసింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన షెఫాలీ... మరో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యింది. షెఫాలి ఔటైన తర్వాత స్కోరు వేగాన్ని పెంచే బాధ్యతను శ్వేత, మరో సీనియర్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49) తీసుకున్నారు. వీరు కూడా పసికూన యూఏఈ బౌలింగ్ ను లెక్క చేయలేదు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరును 200 దాటించారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. 


భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ తేలిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు కేవలం 97 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో లావణ్య కెనీ (24), మహికా గౌర్ (26) పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ తో పాటు పొదుపుగా బౌలింగ్ చేసిన భారత కెప్టెన్ షెఫాలి వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. భారత్‌ తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో బుధవారం స్కాట్లాండ్‌తో తలపడనుంది.