IND vs WI India Squad: 


వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్టు, వన్డే ఆటగాళ్లను ఎంపిక చేసింది. కొందరు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం కల్పించింది. యశస్వీ జైశ్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్ కుమార్‌కు సుదీర్ఘ ఫార్మాట్లో చోటు దక్కింది. నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాను పక్కన పెట్టారు. మహ్మద్‌ షమీకి విశ్రాంతినిచ్చారు. ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించారు. నవదీప్‌ సైనీకి చోటిచ్చారు. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పుజారా కేవలం 35 పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్సులో 14, రెండో ఇన్నింగ్సులో 27తో నిరాశపరిచాడు. పైగా అతడికి 35 ఏళ్లు నిండాయి. అతడిని తప్పించడంతో మూడో స్థానంలో ఎవరో ఒక యువ ఆటగాడు ఆడాల్సిందే. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేస్తున్నాడు. సందర్భాన్ని బట్టి రాణిస్తున్నాడు. అయితే ఎడమచేతి వాటం బ్యాటర్‌ యశస్వీ జైశ్వాల్‌ను రోహిత్‌కి జోడీగా ఆడిస్తే గిల్‌ కీలకమైన మూడో ప్లేస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అజింక్య రహానె తన చోటు నిలబెట్టుకున్నాడు. సెలక్షన్‌ కమిటీ మళ్లీ అతడికి వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇస్తారన్న వార్తలు వచ్చాయి కానీ కమిటీ పట్టించుకోలేదు. ఇక 2021 గబ్బా విజయం తర్వాత నవదీప్‌ సైనీ సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడనేలేదు. యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌ స్టాండ్‌ బై ప్లేయర్లుగా లండన్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. అయితే గైక్వాడ్‌కు 10 వన్డేలు ఆడిన అనుభవం ఉంది.


మహారాష్ట్రకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్‌కు 28 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 42.19 సగటు ఉంది. 6 సెంచరీలు కొట్టాడు. అతడి టెక్నిక్‌కు సెలక్టర్లు ఫిదా అయ్యారు. అందుకే టెస్టు టీమ్‌లోకి ఎంపిక చేశారు. ఇక ముంబయికి ఆడుతున్న జైశ్వాల్‌ 26 ఫస్ట్ క్లాస్‌ ఇన్నింగ్సుల్లో 80.21 సగటుతో అదరగొట్టాడు. ఈ మధ్యే జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున మధ్యప్రదేశ్‌పై 213, 144 పరుగులు చేశాడు. మొత్తం 357 పరుగులతో ఇరానీ చరిత్రలోనే టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. కేవలం ఓపెనర్‌గానే కాకుండా మూడో స్థానంలోనూ అతడికి అనుభవం ఉంది.


ముకేశ్‌ కుమార్‌ బెంగాల్‌ జట్టుకు ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో అతడి బౌలింగ్‌కు మంచి పేరుంది. చివరి మూడు రంజీ సీజన్లలో బెంగాల్‌ను రెండు సార్లు ఫైనల్‌కు తీసుకెళ్లడంలో అతడి పాత్ర ఎంతైనా ఉంది. గత సీజన్లుగా భారత్‌-ఏ మ్యాచులన్నీ ఆడాడు. 39 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఇంకా గాయాల నుంచి రికవరీ అవుతున్నారు. పంత్‌ దూరమైనప్పటి నుంచీ కేఎస్ భరత్‌ ప్రధాన కీపర్‌గా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 5 టెస్టుల్లో 129 పరుగులే చేశాడు. బహుశా అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఈసారి ఆడేంచే అవకాశాలు లేకపోలేదు.


స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాకు అక్షర్‌ పటేల్‌ బ్యాకప్‌గా ఉన్నాడు. లెఫ్టార్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ చోటు నిలబెట్టుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ, ముకేశ్‌ కుమారుకు తోడుగా ఉంటాడు. జులై 12న వెస్టిండీస్‌తో తొలి టెస్టు, జులై 20న రెండో టెస్టు మొదలవుతాయి. ఆ తర్వాత వన్డేలు, టీ20లు ఉంటాయి.


భారత టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ (కె), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, కేఎస్ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌, నవదీప్‌ సైనీ


భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ (వి), ఇషాన్‌ కిషన్‌ (వి), హార్దిక్‌ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌