భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. నాలుగో టీ20 జరిగిన ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలోనే ఈ మ్యాచ్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బౌలింగ్ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతానికి 2-2తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ట్రోఫీని సొంతం చేసుకోనుంది.


ఈ మ్యాచ్‌కు తమ తుది జట్టులో భారత్ ఎటువంటి మార్పులూ చేయలేదు. మరోవైపు వెస్టిండీస్ ఒక్క మార్పే చేసింది. ఒబెడ్ మెకాయ్ స్థానంలో అల్జారీ జోసెఫ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మైదానంలో బౌండరీ లెంత్ చిన్నగా ఉంది. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. నాలుగో టీ20లో 179 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.


మరోవైపు టీమ్ ఇండియాకు బ్యాటింగ్ బాగా ఆందోళన కలిగిస్తుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మొదటి మూడు టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. కానీ నాలుగో మ్యాచ్‌లో రాణించాడు. మరోవైపు సంజూ శామ్సన్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌ల్లో 33 పరుగులు సాధించాడు. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌కి అవకాశం లభించింది. మూడో మ్యాచ్‌లో నిరాశ పరిచినా నాలుగో మ్యాచ్‌లో మాత్రం అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.


నాలుగో టీ20లో భారత్ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్ కేవలం 17 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 179 పరుగులు చేసి గెలుపును సాధించింది. దీంతో భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.


భారత్ తరఫున యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (84 నాటౌట్: 51 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (77: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) కూడా రాణించాడు. వెస్టిండీస్ తరఫున విధ్వంసక బ్యాటర్ షిమ్రన్ హెట్‌మేయర్ (61: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్