Suryakumar Yadav: టీ20 స్పెషలిస్టు, ఈ ఫార్మాట్‌లో  అత్యంత వేగంగా పరుగులు  సాధిస్తున్న భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు.   ఈ ఏడాది ఆరంభంలో  శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లలో తన విన్యాసాలతో అలరించిన  సూర్య ఆ తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు.  మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలలోనూ మూడుసార్లూ డకౌట్ అయిన సూర్య.. ఆ తర్వాత  తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ, టీ2‌0 సిరీస్‌లో తొలి రెండు  మ్యాచ్‌లలో కూడా విఫలమయ్యాడు. కానీ   నిన్న మాత్రం మళ్లీ పాత సూర్యను గుర్తుకుతెస్తూ వీరవిహారం చేశాడు. 


విండీస్‌తో మూడో టీ20లో  23 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన సూర్యాభాయ్.. మొత్తంగా 44 బంతుల్లోనే  10 బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్ల సాయంతో  83 పరుగులు  సాధించాడు. సూర్య  మెరుపులతో 160  పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదించింది. భారత్‌కు విజయాన్ని అందించడంతో పాటు  సూర్య  వ్యక్తిగతంగా పలు రికార్డులను బ్రేక్ చేశాడు.  ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టిన  నయా 360.. టీ20లలో వంద సిక్సర్లను పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేగాక ఈ ఫార్మాట్‌లో శిఖర్ ధావన్ రికార్డునూ బ్రేక్ చేశాడు. 


అత్యంత వేగంగా  వంద సిక్సర్లు.. 


భారత్ తరఫున టీ20లలో అత్యంత వేగంగా వంద సిక్సర్లు బాదిన వారి జాబితాలో సూర్య ప్రథమ స్థానంలో నిలిచాడు.   సూర్యకు ఇది 49వ ఇన్నింగ్స్ కావడం గమనార్హం.  ఈ జాబితాలో   అంతర్జాతీయ స్థాయిలో  మూడో బ్యాటర్‌ సూర్య.  విండీస్‌కు చెందిన క్రిస్ గేల్,  ఎవిన్ లూయిస్ .. 42 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత అందుకన్నారు. బంతులపరంగా చూస్తే.. గేల్ కంటే ముందున్నాడు.  ఈ జాబితాలో ఎవిన్ లూయిస్ (789), కొలిన్ మున్రో (963) తర్వాత సూర్య.. 1,007 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. క్రిస్ గేల్.. 1,071 బంతుల్లో ఈ వంద సిక్సర్లు బాదాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌‌లో వంద, అంతకుమించి సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో సూర్య 15వ స్థానంలో  నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (182 సిక్సర్లు)  అగ్రస్థానంలో ఉన్నాడు. 


ఇక భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో సూర్య మూడో స్థానానికి చేరాడు.  ఈ జాబితాలో  రోహిత్ శర్మ.. 140 ఇన్నింగ్స్‌లలో 182 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్‌లలో 117 సిక్సర్లు కొట్టాడు. సూర్య  101 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా కెఎల్ రాహుల్ 99 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.  


 






గబ్బర్ రికార్డు కూడా.. 


ఇక నిన్నటి మ్యాచ్‌లో 83  పరుగులు చేయడం ద్వారా  సూర్య.. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌కు ముందు ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న సూర్య (1,780 పరుగులు).. ధావన్‌ (1,759 పరుగులు) ను దాటేసి నాలుగో స్థానానికి చేరాడు.  ఈ జాబితాను ఇక్కడ చూద్దాం. 


ఇండియా తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు.. 


కోహ్లీ - 115  మ్యాచ్‌లలో 4,008 పరుగులు 
రోహిత్ శర్మ - 148 మ్యాచ్‌లలో 3,853
కెఎల్ రాహుల్ - 72 మ్యాచ్‌లలో 2,265
సూర్యకుమార్ యాదవ్ - 51 మ్యాచ్‌లలో 1,780
శిఖర్ ధావన్ - 68 మ్యాచ్‌లలో 1,759 






























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial