2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా మరోసారి టెస్టులు ఆడటానికి సిద్ధం అయింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ప్రారంభం అయిన మొదటి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2023-25 టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్లో రెండు జట్లకు ఇదే మొదటి టెస్టు మ్యాచ్. 


ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. తనతో పాటు యశస్వి జైస్వాల్ కూడా మొదటిసారి టీమిండియా జెర్సీ ధరించనున్నాడు. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వికి టీమిండియాలో కూడా అరంగేట్రం చేసే అవకాశం లభించింది.


తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు లభించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ద్వయం స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు. దీంతో అక్షర్ పటేల్‌కు మొండిచేయి తప్పలేదు. శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్‌లు పేస్ దళంలో ఉన్నారు.


ఇక బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే... రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. తర్వాత విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఉన్నారు. అవసరాన్ని బట్టి రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్‌ల బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.


మరోవైపు వెస్టిండీస్ జట్టులో అథనజే అరంగేట్రం చేయనున్నాడు. రహ్కీమ్ కార్న్‌వాల్, జోమెల్ వారికన్ స్పిన్ కోటా చూసుకోనున్నారు. అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్ పేస్ బౌలర్ల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 


భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్


వెస్టిండీస్ తుది జట్టు
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చందర్‌పాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథనజే, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, రహ్కీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్