భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేయనుంది. ఇది టీమిండియాకు 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
భారత్ ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త వారికి అవకాశం ఇచ్చింది. తిలక్ వర్మ, ముకేష్ కుమార్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను కూడా 1-0తో గెలుచుకుంది.
అంతకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కేవలం 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (52: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. ఆ తర్వాత రెండో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అనంతరం మూడో వన్డేలో ఏకంగా 200 పరుగులతో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-1తో సొంతం చేసింది.
వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్