IND Vs WI, 1st T20:


కరీబియన్‌ దీవుల్లో మరో అద్భుత సిరీసుకు భారత్‌ సిద్ధమైంది. పొట్టి క్రికెట్లో మేటి జట్టైన వెస్టిండీస్‌తో తలపడనుంది. టెస్టు, వన్డేల్లో తేలిపోయినప్పటికీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ విండీస్‌ క్రికెటర్లదే హవా! దాంతో సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పైగా టీమ్‌ఇండియాకు ఇది 200 టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. వన్డే సిరీసును 2-1తో కైవసం చేసుకొని ఊపులో కనిపిస్తున్న కుర్రాళ్లు ఇందులో ఏం చేస్తారో చూడాలి!!


ముగ్గురి అరంగేట్రం


టాప్‌ క్రికెటర్లు లేకుండానే టీమ్‌ఇండియా పొట్టి సిరీసు బరిలోకి దిగుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ లేకుండానే ఆడనుంది. అయితే హార్దిక్‌ సేనపై మంచి అంచనాలే ఉన్నాయి. జట్టు నిండా ఐపీఎల్‌ స్టార్లే ఉండటం ఆశలు రేపుతోంది. అరంగేట్రంలో టెస్టులోనే 171తో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్‌ (Yashasvi Jaiswal) మరోసారి ఓపెనర్‌గా దిగడం ఖాయం. అతడికి శుభ్‌మన్‌ గిల్‌ తోడుగా ఉంటాడు. హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Varma) అరంగేట్రానికి వేళైంది. ముంబయి ఇండియన్స్‌ మిడిలార్డర్లో అతడెంత కీలకంగా ఆడాడో తెలిసింది. సూర్యకుమార్‌, హార్దిక్‌తో అతడి భాగస్వామ్యాలు కీలకం కానున్నాయి. ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan), సంజూ శాంసన్‌ (Sanju Samson) ఇద్దరూ ఫామ్‌లో ఉన్నారు. తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. ముకేశ్‌ కుమార్‌ ఎంట్రీ చేసినా ఆశ్చర్యం లేదు. అర్షదీప్‌ సింగ్‌కు తోడుగా ముకేశ్‌, మాలిక్‌, అవేశ్‌ ఖాన్‌లో ఎవరో ఒకరు ఉంటారు. అక్షర్ పటేల్‌, కుల్‌దీప్‌ స్పిన్‌ చూస్తారు. పిచ్‌ను బట్టి యూజీ, బిష్ణోయ్‌లో ఒకరికి ఛాన్స్‌ ఉంటుంది.


డిస్ట్రక్టివ్‌ సెటప్‌!


పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ సిరీసుకు ముందే దక్షిణాఫ్రికాను 2-1 తేడాతో ఓడించింది. అంతకు ముందే న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించింది. యువ క్రికెటర్‌ నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran) విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యే మేజర్‌ లీగ్‌ క్రికెట్లో ముంబయి ఇండియన్స్‌ న్యూయార్క్‌కు (MI New York) ట్రోఫీ అందించాడు. అతడు కనక అరగంట క్రీజులో నిలిస్తే పరుగుల వరద ఖాయమే! ఆల్‌రౌండర్స్‌ జేసన్‌ హోల్డర్‌, ఓడీన్‌ స్మిత్‌, అకేల్‌ హుసేన్‌ ఉన్నారు. రెండు ప్రపంచకప్‌ల కెప్టెన్‌ డారెన్‌ సామి విండీస్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. కెప్టెన్‌గా ఎంపికైన రోమన్‌ పావెల్‌ విధ్వంసం సృష్టించగలడు. కైల్‌ మేయర్స్‌ డిస్ట్రక్షన్‌ సృష్టిస్తే కోలుకోవడం కష్టం. బ్రాండన్‌ కింగ్‌, షై హోప్‌ గురించి తెలిసిందే.


అంచనా జట్లు


వెస్టిండీస్‌ : బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, జేసన్ చార్లెస్‌ / షై హోప్‌, నికోలస్‌ పూరన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రోమన్‌ పావెల్‌, రోస్టన్ ఛేజ్‌, జేసన్‌ హోల్డర్, రొమారియో షెఫర్డ్‌ / ఓడీన్‌ స్మిత్‌, అకేల్‌ హుసేన్‌, అల్జారీ జోసెఫ్‌ / ఓషాన్‌ థామస్‌


భారత్‌ : శుభ్‌మన్ గిల్‌, యశస్వీ జైశ్వాల్‌, ఇషాన్‌ కిషన్‌ / సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ / రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్ కుమార్‌ / ఉమ్రాన్ మాలిక్ / అవేశ్‌ ఖాన్‌