Shikhar Dhawan: టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ కెరీర్ ముగింపునకు వచ్చేసిందా! ఇప్పటికే టీ20లకు దూరమైన ధావన్ వన్టేలకు దూరమవనున్నాడా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం నిన్న బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ లేడు. దీన్ని బట్టి 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం సెలక్టర్లు ధావన్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్ధమవుతోంది. 


పేలవ ఫాంతో సతమతం


ఇటీవల జరిగిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీసుల్లో ధావన్ రాణించలేదు. కివీస్ తో కెప్టెన్ గా కూడా వ్యవహరించినప్పటికీ వ్యక్తిగతంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. బంగ్లాతోనూ బ్యాట్ తో ఆకట్టుకోలేదు. అంతకుముందు ధావన్ స్ట్రైక్ రేట్ పైనా ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో తాజాగా లంకతో సిరీస్ కు ధావన్ ను సెలక్టర్లు పక్కన పెట్టారు. బంగ్లాతో చివరి వన్డేలో మెరుపు ద్విశతకం సాధించిన ఇషాన్ కిషన్ ను శిఖర్ కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్లు అర్ధమవుతోంది.


ప్రపంచకప్ జట్టులో ఇషాన్!


బంగ్లాతో అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్... వచ్చే ప్రపంచకప్ కోసం సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది మాజీలు కూడా ఫామ్ లో లేని ధావన్ స్థానంలో కిషన్ ను తీసుకుంటే బావుంటుందని సూచిస్తున్నారు. ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇషాన్ కిషన్ తన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో వన్డే ప్రపంచకప్ కు బలమైన పోటీదారుగా మారాడు. ప్రస్తుతం ఫాంలోని లేని శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కు అవకాశమివ్వాలి. ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు. అయితే ఇదే జరగాలని నేననుకుంటున్నాను. కిషన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. రాబోయే కొన్ని నెలల్లో ఇదే నిలకడను అతను కొనసాగిసించి, ఫిట్ గా ఉంటే వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం లభిస్తుంది. అని బ్రెట్ లీ అన్నాడు. 






నిన్న శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. 


శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు


హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.


శ్రీలంకతో వన్డే సిరీస్ కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్.