IND VS SL, MD Kaif Slams Gill Over Kuldeep Spell: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఉపయోగించిన తీరుపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసహనం వ్యక్తం చేశాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యువ బౌలర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో చెలరేగగా, రవీంద్ర జడేజా కీలక వికెట్లు పడగొట్టాడు. కానీ కుల్దీప్ మాత్రం కేవలం ఒకే ఒక్క వికెట్ తీసి చాలా తక్కువ ఓవర్లు వేసిన సంగతి తెలిసిందే. సుతార్, జడేజా చెరో 44 ఓవర్లకు పైగా బౌలింగ్ చేస్తే, కుల్దీప్‌కు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 25 ఓవర్లు మాత్రమే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవ్వడం గమనార్హం.
ఎక్కువ ఓవర్లు ఇవ్వాలి..తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన కైఫ్, గిల్ కెప్టెన్సీపై ఆరోపణలు చేశాడు. "కుల్దీప్‌ను వాడిన విధానం చూస్తే అతడిపై శుభ్‌మన్ గిల్‌కు తగినంత నమ్మకం లేదని తెలుస్తోంది. నా దృష్టిలో కుల్దీప్ లాంటి విలక్షణమైన బౌలర్ తరచుగా లభించడు. అలాంటి ఆటగాళ్లు చరిత్రలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే దొరకుతారు. భవిష్యత్తులో జడేజా స్థానంలో సుతార్ రావచ్చు, అశ్విన్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, కానీ కుల్దీప్ ఒక అరుదైన వరంలాంటి వాడు. రిస్ట్ స్పిన్నర్లకు సుదీర్ఘ స్పెల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న స్పెల్స్ ఇవ్వడం వల్ల కుల్దీప్ రిథమ్ అందుకోలేకపోయాడని తెలుస్తోంది. తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ అతడికి దక్కలేదు" అని కైఫ్ విమర్శించాడు.
కివీస్ టూర్ కు కీలకం..గతంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లే విదేశీ పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్ ఇండియా నంబర్ 1 స్పిన్నర్ అని కైఫ్ పేర్కొన్నాడు. "టర్నింగ్ ట్రాక్స్‌పై కేవలం కచ్చితత్వంతో ఒకే చోట బౌలింగ్ చేస్తే వికెట్లు లభిస్తాయి. కానీ నవంబర్ లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో ఇలాంటి పిచ్‌లు లభించవు. ఫ్లాట్ వికెట్లు లేదా పెద్దగా టర్న్ లేని పిచ్‌లపై కుల్దీప్ అత్యంత కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు. కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ అతడి ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సి ఉంది" అని వ్యాఖ్యానించాడు.
రెండో టెస్టులో టీమిండియాలో మార్పు..కొలంబోలో జరిగే రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఉందని కైఫ్ వ్యాఖ్యానించాడు. శ్రీలంక బ్యాటర్లు నిరోషన్ డిక్వెల్లా, సొనాల్ దినుష ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఏర్పడిందని పేర్కొన్నాడు. లంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు కుల్దీప్ స్థానంలో సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదివారం నుంచి కొలంబోలో రెండో టెస్టు ప్రారంభమవుతుండగా, తొలి టెస్టును నెగ్గిన టీమిండియా, 1-0తో ఆధిక్యంలో ఉంది.
