IND VS SL, Russell Arnold Weighs In On Indian Spin Attack Dilemma Against Sri Lanka: శ్రీలంకతో కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా పిచ్ స్వభావంపైనే ఆధారపడి ఉంటుందని శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ వ్యాఖ్యానించాడు. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇండియా 165 రన్స్ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. కుల్దీప్ స్థానంలో జట్టులోకి వస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 181 వికెట్లు, 2,223 రన్స్ చేసిన ఇండోర్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు ఇది డెబ్యూ మ్యాచ్ అవుతుండటం విశేషం.
లాజిక్ ప్రకారం చూస్తే..
శ్రీలంక జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు రాణిస్తున్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్‌ను తీసుకోవడం లాజిక్కే అయినా, ప్రాక్టీస్ సెషన్ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆర్నాల్డ్ తెలిపాడు. పిచ్ పొడిగా ఉండి ఆది నుంచే టర్న్ అయ్యే అవకాశం ఉంటే సారాంశ్ జైన్ బెస్ట్ ఆప్షన్ అవుతాడని వ్యాఖ్యానించాడు. ఒకవేళ పిచ్ ఫ్లాట్‌గా ఉండి ఆట సాగుతున్న కొద్దీ నెమ్మదిస్తే మాత్రం ప్రత్యర్థిని బోల్తా కొట్టించడానికి కుల్దీప్ యాదవ్ నైపుణ్యం అవసరమని తెలిపాడు.
Read Also: NO BPL This Year: పాపం బంగ్లా.. నష్టాలతో బీపీఎల్ రద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
తేలిపోయిన బ్యాటింగ్..మరోవైపు శ్రీలంక జట్టు టాప్ ఆర్డర్ వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోంది. గాలే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులకే 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి లంక చేతులెత్తేసింది. పాథుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ గాయాలతో దూరం కాగా, దినేష్ చండిమల్ సైతం కంకషన్ కారణంగా కొలంబో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. టెస్ట్ ఆడే అన్ని దేశాల్లో శ్రీలంక ఓపెనింగ్ భాగస్వామ్యాలు అత్యంత పేలవంగా ఉన్నాయని ఆర్నాల్డ్ గుర్తు చేశాడు. కొత్త బంతి గట్టిగా ఉన్నప్పుడు అనవసర దూకుడు ప్రదర్శించి వికెట్లు సమర్పించుకున్నారని, కామిందు మెండిస్ లాంటి అనుభవజ్ఞుడు కూడా అదే తప్పు చేశాడని నిట్టూర్చాడు. బంతి పాతబడే వరకు క్రీజులో నిలబడితే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందని గుర్తు చేశాడు
లంక జట్టులో మార్పులు..
కొలంబో మ్యాచ్ కోసం శ్రీలంక జట్టులోనూ మార్పులు ఉండవచ్చని ఆర్నాల్డ్ వ్యాఖ్యానించాడు. ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమారను పక్కన పెట్టి ఆఫ్ స్పిన్నర్ రమేష్ మెండిస్‌ను తుది జట్టులోకి తీసుకునే చాన్స్ ఉందని పేర్కొన్నాడు. ఇద్దరు స్పిన్నర్లు చిన్న స్పెల్స్ వేస్తే మరింత తాజాగా, శక్తితో బౌలింగ్ చేయగలుగుతారని ఆర్నాల్డ్ తెలిపాడు. బ్యాటర్లను గాల్లోనే బోల్తా కొట్టించాలంటే పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇక రెండో టెస్టు ఆదివారం నుంచి కోలంబో వేదికగా ప్రారంభం కానుంది.
