IND vs SL Asia Cup 2023 Final: మూడు వారాలుగా   క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఆసియా కప్  - 20‌23 చివరి అంకానికి చేరింది.    ఆదివారం (సెప్టెంబర్ 17న)  భారత్ - శ్రీలంకలు  ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్లకూ గాయాలు షాకిస్తున్నాయి.  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్  ఫైనల్ పోరుకు అందుబాటులో ఉండటం లేదు. లంక  జట్టులో కూడా స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ  ఫైనల్‌కు దూరమయ్యాడు.  


శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి సూపర్ - 4 మ్యాచ్‌లో భాగంగా అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే   తొడ కండరాలతో పాటు ఇతర గాయాలు వేధిస్తున్నా   అక్షర్.. పట్టుదలతో బ్యాటింగ్ చేసి భారత్‌కు విజయం మీద ఆశలు కల్పించాడు.  34 బంతుల్లో  3 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లతో  42 పరుగులు చేసిన అక్షర్..  గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తున్నది. అతడి  స్థానంలో  టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరనున్నట్టు సమాచారం.  


బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘అవును, అక్షర్ ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడి వేలికి, తొడకు గాయాలయ్యాయి. అందుకే ఫైనల్‌లో అక్షర్‌కు బదులుగా వాషింగ్టన్‌ను  భర్తీ చేస్తున్నాం..’ అని తెలిపాడు. 


 






వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టు శిక్షణ శిబిరంలో ఉన్నాడు.  ఆసియా కప్ ఫైనల్ కోసం అతడిని  బీసీసీఐ ఆగమేఘాల మీద  కొలంబోకు పంపనుందని సమాచారం. ఒకవేళ  ఫైనల్‌లో వాషింగ్టన్‌కు ఆడే అవకాశమొస్తే  అది భారత్‌కు లాభించేదే. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. ఎడమ చేతి వాటం  బ్యాటర్లను ఇబ్బందులు పెట్టొచ్చు.  స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సుందర్  మ్యాజిక్ చేస్తే  భారత్‌కు కచ్చితంగా లాభమే. బంతితోనే గాక బ్యాట్ తోనూ విలువైన పరుగులు చేసే వాషింగ్టన్ చివరిసారిగా వన్డేలలో ఈ ఏడాది జనవరిలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.  ఒకవేళ కొలంబోకు వెళ్లినా అతడు తిరిగి ఎన్‌సీఏకే  రావాల్సి ఉంది.   త్వరలో మొదలుకాబోయే ఆసియా క్రీడలలో భాగంగా క్రికెట్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న అతడు..  చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.






ఇక లంక విషయానికొస్తే..  సూపర్ - 4 లో భాగంగా పాకిస్తాన్‌తో రెండ్రోజుల క్రితం ముగిసిన  మ్యాచ్‌లో  తీక్షణ గాయపడ్డాడు.  అతడికి అయిన  ఇంజ్యూరీని లంక క్రికెట్ వర్గాలు  గ్రేడ్ - 2 గాయంగా పేర్కొంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే  తీక్షణను ఫైనల్ ఆడించకపోవడమే బెటర్ అనే అభిప్రాయంలో లంక ఉంది. 








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial