తొలి టీ20లో దక్షిణాఫ్రికా జట్టుపై వంద పరుగులకు పైగా తేడాతో నెగ్గిన భారత్ రెండవ T20 మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. తెలుగు తేజం తిలక్ వర్మ (62) హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, ఇతరుల నుంచి సహకారం లేకపోవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.  దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 213 పరుగులు చేసింది. అయితే ఛేజింగ్‌కు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. టాస్ గెలిచిన తర్వాత కూడా ఇండియా తప్పుడు నిర్ణయాల కారణంగా ఘోరంగా ఓడిపోయింది. ముల్లాన్‌పూర్‌లో భారత జట్టు ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి?

Continues below advertisement

1. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు

భారత్ మొదటి 2 ఓవర్లలోనే స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. మూడో స్థానంలో అక్షర్ పటేల్‌ను పంపించారు, అతను పవర్‌ప్లేలో అంచనాలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెగ్యూలర్‌గా వచ్చినట్లు మూడో స్థానంలో బ్యాటింగుకు వచ్చి ఉంటే, అతని 30- 40 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ప్లస్ అయ్యేది. అక్షర్ నంబర్ 3కి రావడంతో తిలక్ వర్మతో సహా అందరు బ్యాట్స్‌మెన్‌ల స్థానాలు కిందకు జరిగాయి. ఫినిషర్ పాత్ర పోషించే శివమ్ దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎవరైతే పవర్ హిట్టర్, స్టార్ బ్యాటర్ కాదో అతడ్ని కీలక స్థానంలో బ్యాటింగ్ కు దింపడంతో మిగతా బ్యాటర్ల స్థానాలు మారాయి. 

2. కెప్టెన్, వైస్ కెప్టెన్ పేలవమైన ఫామ్

భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవమైన ఫామ్‌ కంటిన్యూ చేస్తున్నారు. గిల్ ఖాతా తెరవకుండానే డకౌట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 పరుగులు చేశాడు. ఈ ఏడాది గిల్ ఒక్క T20 అర్ధ సెంచరీ కూడా చేయలేదు. కెప్టెన్ సూర్య T20 సగటు ఈ సంవత్సరం కేవలం 14.4గా ఉంది. గిల్, సూర్యకుమార్ బాధ్యతగా ఆడకపోవడం ఇండియా ఓటమికి ఒక ప్రధాన కారణం.

Continues below advertisement

3. హార్దిక్ పాండ్యా నెమ్మదిగా ఆడటం

హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, 7.3 ఓవర్లలో భారత్ స్కోరు 67/4. ఆ సమయానికి భారత జట్టు 12.3 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో ఏ బ్యాటర్ వచ్చినా జట్టు వేగంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధిస్తాడని ఆశిస్తుంది.  కానీ హార్దిక్ ఆ సమయంలో చాలా నెమ్మదిగా ఆడాడు. 23 బంతుల్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు చేశాడు. ఇది భారత జట్టుకు మరింత భారంగా మారింది.

4. భారీగా పరుగులు సమర్పించుకున్న బుమ్రా- అర్ష్‌దీప్ 

భారత జట్టు ఓటమికి పునాది మొదటి ఇన్నింగ్స్‌లోనే పడింది. T20 జట్టులోని ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థి జట్టుకు 99 పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా 4 ఓవర్లలో 45 పరుగులు ఇవ్వగా, అర్ష్‌దీప్ తన ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. ఓ ఓవర్ లో అయితే అర్షదీప్ ఏకంగా 7 వైడ్ బాల్స్ వేశాడు.

5. కొంపముంచిన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ 

అక్షర్ పటేల్ మూడో ఓవర్లోనే, అది కూడా కీలకమైన 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. పవర్‌ప్లేలో వచ్చి వేగంగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా, ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ వరకు 17 బంతులు ఆడిన అక్షర్ పటేల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ వేగాన్ని పెంచలేకపోయాడు. 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయడంతో తరువాత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో మిగతా బ్యాటర్లు కీలక సమయంలో పరుగులు రాబట్టలేకపోయారు.