లక్నో: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకు కారణంగా ఇద్దరు స్టార్ బ్యాటర్లు వరుసగా విఫలం కావడమే. ముఖ్యంగా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఆల్ రౌండర్ శివమ్ దూబే, ఫామ్ లో లేని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు మద్దతుగా నిలిచాడు. టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ మ్యాచ్ విన్నర్ అని.. అతడు ఒంటరిగా మ్యాచ్ గెలిపించగల బ్యాటర్ అని, సరైన సమయంలో ఫామ్ లోకి వస్తాడని దీమా వ్యక్తం చేశాడు.
ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించే ప్లేయర్
సూర్యకుమార్ చివరి టీ20 హాఫ్ సెంచరీ అక్టోబర్ 2024లో చేశాడు. ప్రపంచ కప్ నకు రెండు నెలల కంటే తక్కువ సమయం ఉండటంతో SKYపై ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్ కు కొన్ని గంటల ముందు దూబే మాట్లాడుతూ.. "సూర్యపై మాకు నమ్మకం ఉంది. అతడు ఒక్కడే 5 మ్యాచ్ లు గెలిపించగలడు. ఫామ్ లో లేకపోతే అతను మంచి ఆటగాడు కాదని అనలేం. ఒంటి చేత్తో భారత్‌కు విజయాలు అందించగల టాలెంట్ అతడి సొంతం" అన్నాడు.
ఏ క్షణంలోనైనా అతడి నుంచి బిగ్ ఇన్నింగ్స్
"అతను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతడి గణాంకాలు చూస్తే మీకే తెలుస్తుంది. అవును, ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ పరుగులు బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. కానీ సరైన సమయంలో అతను ఫామ్ లోకి వస్తాడు. ఏ క్షణంలోనైనా బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. సూర్య ఓ యోధుడు. అతను పరుగులు చేసినా చేయకపోయినా, మంచి ఆటగాడు. ఎల్లప్పుడూ జట్టు కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. అతను చాలా దూకుడుగా ఆడే బ్యాటర్, ఇంకా చెప్పాలంటే 360 డిగ్రీల బ్యాట్స్ మన్" అని శివం దూబే అన్నాడు.
భారత బెస్ట్ బ్యాటర్లలో గిల్ ఒకడు
వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఫామ్ లో లేడు, కానీ అతడు సైతం బెస్ట్ ఓపెనర్, బెస్ట్ బ్యాటర్ అని శివం దూబే అతనిపై కూడా నమ్మకం ఉంచాడు. "శుభమన్ గిల్ ఒక మంచి ఆటగాడు. ఫామ్ ఉన్నా, లేకపోయినా అతని సగటు, స్ట్రైక్ రేట్ బాగుంటాయి. గత కొన్నేళ్లుగా గిల్ భారతదేశం కోసం మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఏ ప్లేయర్ కైనా ఆటలో హెచ్చు తగ్గులు సహజం. కానీ అతను భారతదేశపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడన్నది వాస్తవం" అన్నాడు.
దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓడినా, వన్డే సిరీస్ నెగ్గి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ లో 2-1తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. నేడు లక్నో వేదికగా నాలుగో టీ20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ భారత్ నెగ్గితే సూర్య సేన సిరీస్ సొంతం చేసుకుంటుంది.