IND vs SA 3rd ODI: మూడో వన్డేలో టీమ్‌ఇండియా తన జోరు చూపించింది. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. భారత పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా అదరగొట్టి దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కుప్పకూల్చారు. 27.1 ఓవర్లకే చాప చుట్టించారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (34; 42 బంతుల్లో 4x4) ఒక్కడే ఓపికగా ఆడాడు. ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (15; 27 బంతుల్లో 3x4), మార్కో జన్‌సెన్‌ (14; 19 బంతుల్లో 1x4, 1x6) రెండంకెల స్కోరు చేశారు. కుల్‌దీప్‌ 4 వికెట్లు పడగొట్టాడు.




బౌలర్లు భళా!


ఓవర్‌ క్యాస్ట్ కండీషన్స్‌, పిచ్‌లో తేమ ఉండటంతో గబ్బర్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సొంత మైదానం కావడంతో తనదైన సూచనలతో బౌలర్లను నడిపించాడు. దక్షిణాఫ్రికా వంటి పటిష్ఠమైన జట్టును వంద పరుగుల్లోపే ఆలౌట్‌ చేసేందుకు కీలకంగా మారాడు. వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకొచ్చి జట్టు స్కోరు 7 వద్దే క్వింటన్‌ డికాక్‌ (6)ను పెవిలియన్‌ పంపించాడు. అత్యంత కీలకమైన జానెమన్‌ మలన్‌, రెజా హెండ్రింక్స్‌ను తనదైన బౌన్సర్లతో సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. వీరిద్దరినీ పరుగు వ్యవధిలోనే ఔట్‌ చేయడం గమనార్హం.


మంచి ఫామ్‌లో ఉన్న అయిడెన్‌ మార్‌క్రమ్‌ (9), హెన్రిచ్‌ క్లాసెన్‌ను షాబాజ్‌ అహ్మద్ ఔట్‌ చేశాడు. స్పిన్‌తో ఇబ్బంది పెట్టాడు. మరికాసేపటికే ఇన్‌ఫామ్‌ డేవిడ్‌ మిల్లర్ (8)ను సుందర్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 66-5తో కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత ఫెలుక్‌వాయో (5), ఫార్టూయిన్‌ (1), ఆన్రిచ్‌ నోకియా (0), మార్కో జన్‌సెన్‌ (1) వికెట్లను కుల్‌దీప్‌ ఫటాఫట్‌ పడగొట్టేశాడు.