IND vs SA, Match Highlights: అటేమో పటిష్ఠమైన సీనియర్ల దక్షిణాఫ్రికా! ఇటేమో ద్వితీయ శ్రేణి టీమ్‌ఇండియా! అయితేనేం! కుర్రాళ్లు అదరగొట్టారు. సీనియర్లు లేని వేళ సమయోచిత ఇన్నింగ్సులతో దుమ్మురేపారు. ప్రధాన జట్టుకు తామేమీ తీసిపోమంటూ పరిణతి చాటారు. సఫారీలపై 2-1తో వన్డే సిరీస్‌ను పట్టేశారు. ఆఖరి వన్డేలో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించారు. దిల్లీలో సఫారీలు నిర్దేశించిన 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. 3 వికెట్లు నష్టపోయి 19.1 ఓవర్లకే విజయం సాధించారు. శుభమ్‌న్‌ గిల్‌ (49; 57 బంతుల్లో 8x4) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అంతకు ముందు ప్రోటీస్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (34; 42 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌.






గిల్‌ క్లాస్‌


స్వల్ప లక్ష్యమే కావడంతో టీమ్‌ఇండియా నిలకడగా ఆడింది. అస్సలు ప్రెజర్‌ తీసుకోలేదు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ సొగసైన కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. సఫారీలు విసిరే ప్రతి చెత్త బంతిని బౌండరీకి పంపించాడు. మరోవైపు శిఖర్ ధావన్‌ (8) ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే 6.1వ బంతికి అనవసర పరుగుకు యత్నించిన గబ్బర్‌ను జన్‌సెన్‌ రనౌట్‌ చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్‌ కిషన్‌ (10; 18 బంతుల్లో 2x4) త్వరగా ఔటయ్యాడు. ఫార్టూయిన్‌ బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి స్కోరు 58-2. రన్‌రేట్‌ ఒత్తిడేమీ లేకపోవడం, కావల్సినన్ని ఓవర్లు ఉండటంతో శ్రేయస్‌ అయ్యర్‌ (28*; 23 బంతుల్లో 3x4, 2x6) అండతో శుభ్‌మన్‌ గిల్‌ జట్టుకు విజయం అందించేశాడు.






పేస్‌, స్పిన్‌ పోటాపోటీ


ఓవర్‌ క్యాస్ట్ కండీషన్స్‌, పిచ్‌లో తేమ ఉండటంతో గబ్బర్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సొంత మైదానం కావడంతో తనదైన సూచనలతో బౌలర్లను నడిపించాడు. దక్షిణాఫ్రికా వంటి పటిష్ఠమైన జట్టును వంద పరుగుల్లోపే ఆలౌట్‌ చేసేందుకు కీలకంగా మారాడు. వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకొచ్చి జట్టు స్కోరు 7 వద్దే క్వింటన్‌ డికాక్‌ (6)ను పెవిలియన్‌ పంపించాడు. అత్యంత కీలకమైన జానెమన్‌ మలన్‌, రెజా హెండ్రింక్స్‌ను తనదైన బౌన్సర్లతో సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. వీరిద్దరినీ పరుగు వ్యవధిలోనే ఔట్‌ చేయడం గమనార్హం.


మంచి ఫామ్‌లో ఉన్న అయిడెన్‌ మార్‌క్రమ్‌ (9), హెన్రిచ్‌ క్లాసెన్‌ను షాబాజ్‌ అహ్మద్ ఔట్‌ చేశాడు. స్పిన్‌తో ఇబ్బంది పెట్టాడు. మరికాసేపటికే ఇన్‌ఫామ్‌ డేవిడ్‌ మిల్లర్ (8)ను సుందర్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 66-5తో కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత ఫెలుక్‌వాయో (5), ఫార్టూయిన్‌ (1), ఆన్రిచ్‌ నోకియా (0), మార్కో జన్‌సెన్‌ (1) వికెట్లను కుల్‌దీప్‌ ఫటాఫట్‌ పడగొట్టేశాడు.