దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), రాసీ వాన్ డర్ డుసెన్ (75 నాటౌట్: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించారు.


అదరగొట్టిన ఇషాన్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే స్టార్ట్ లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (76: 48 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (23: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 57 పరుగులు జోడించారు. అనంతరం వేన్ పార్నెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ కావడంతో ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.


మొదటి వికెట్ పడ్డాక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (36: 27 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మొదట శ్రేయస్ అయ్యర్ వేగంగా ఆడినప్పుడు ఇషాన్ తనకు చక్కటి సహకారం అందించాడు. మెల్లగా ఇషాన్ కిషన్ కూడా ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు. కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు బౌండరీలను ఇషాన్ కిషన్ సాధించాడు. అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు.


ఆ తర్వాత కాసేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. ఆఖర్లో రిషబ్ పంత్ (29: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (31: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా చెలరేగి ఆడారు. చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 61 పరుగులు సాధించింది. 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్ తలో వికెట్ తీసుకున్నారు.


అదరగొట్టిన మిల్లర్, డుసెన్
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్  కొంచెం మందకొడిగా ఆరంభమైంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ టెంబా బవుమా (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటయ్యాడు. ప్రమోషన్ పొంది వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డ్వేన్ ప్రిటోరియస్ (29: 13 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) క్రీజులో ఉన్నంత సేపు స్కోరు పరుగులు పెట్టింది. ఆరో ఓవర్లో ప్రిటోరియస్, తొమ్మిదో ఓవర్లో క్వింటన్ డికాక్ (22: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యారు.


ఈ దశలో డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), రాసీ వాన్ డర్ డుసెన్ (75 నాటౌట్: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. క్రీజులో నిలబడటానికి సమయం తీసుకున్నప్పటికీ కుదురుకున్నాక చెలరేగిపోయారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అజేయమైన మూడో వికెట్‌కు 10.3 ఓవర్లలోనే 131 పరుగులు జోడించి మ్యాచ్‌ను గెలిపించారు. వీరి ఆటతీరుతో దక్షిణాఫ్రికా ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.