Virat Kohli breaks 5 records at Ranchi odi | విరాట్ కోహ్లీ రాంచీలో జరిగిన దక్షిణాఫ్రికాపై 135 పరుగులు చేసి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ శతకంతో పాటు రోహిత్ శర్మ, రాహుల్ హాఫ్ సెంచరీలతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో రెండు వరుస డకౌట్ల తరువాత మూడో వన్డేలో హాఫ్ సెంచరీ టచ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ ఈ వన్డేలో ఏకంగా శతకం బాదేశాడే.  మొత్తం స్టేడియం నిలబడి చప్పట్లు కొట్టింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిలబడి అతనికి చప్పట్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ చేసిన 5 పెద్ద రికార్డులు ఏమిటో తెలుసుకోండి.

Continues below advertisement


1. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు


విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అతను సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెస్ట్ క్రికెట్‌లో 51 సెంచరీలు చేయగా.. ఏ ఫార్మాట్‌లోనైనా (T20, టెస్ట్, వన్డే) ఇంతకంటే ఎక్కువ సెంచరీలు ఎవరికీ లేవు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు. అతను వన్డే క్రికెట్‌లో 52 సెంచరీలు చేశాడు.


2. ఒక భారత వేదికపై అత్యధిక సెంచరీలు


విరాట్ కోహ్లీ ఇప్పుడు ఒక భారత వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆడిన కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు సాధించాడు. విశాఖపట్నం,  పూణేలలో కూడా విరాట్ 3- 3 సెంచరీలు సాధించాడు. ఇక్కడ కోహ్లీ సగటు సైతం వందకు పైగా నమోదు చేశాడు.


3. దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు


 దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాంచీలో కోహ్లీకి దక్షిణాఫ్రికాపై ఇది ఆరో వన్డే సెంచరీ. గతంలో ఈ రికార్డు సచిన్, డేవిడ్ వార్నర్ (5 సెంచరీలు) పేరిట ఉండేది.






4. స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన విరాట్ కోహ్లీ


విరాట్ కోహ్లీ 135 పరుగుల ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ మరో పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. భారతదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధికంగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది, 58 సార్లు ఇలా చేశాడు. కోహ్లీ స్వదేశంలో వన్డేల్లో 59 సార్లు 50 ప్లస్ స్కోరు నమోదు చేశాడు.






5. నంబర్ 3లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు


విరాట్ కోహ్లీ నంబర్ 3 స్థానంలో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌. అతను రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. పాంటింగ్ 540 ఇన్నింగ్స్‌లలో 217 సిక్సర్లు కొట్టాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో 327 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయగా 218 సిక్సర్లు కొట్టాడు.