India vs Pakistan: ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2023కి సంబంధించిన షెడ్యూల్‌ను జనవరి 5వ తేదీన విడుదల చేసింది. ఏసీసీ ప్రకటించిన ఆసియా కప్ షెడ్యూల్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. మహిళల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్, పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్, పురుషుల అండర్-19 ఆసియా కప్‌లలో కూడా భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. 2023 చివరిలో 50 ఓవర్ల ప్రపంచ కప్ జరగనుంది. ఇందులో కూడా భారత్-పాక్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి-మార్చిలో మహిళల టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఇక్కడ కూడా భారత మహిళల జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. దీంతో పాటు అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు కూడా తలపడనున్నాయి.
10 కంటే ఎక్కువ మ్యాచ్‌లు
ఈ వివిధ క్రికెట్ టోర్నమెంట్‌ల క్రింద భారతదేశం, పాకిస్తాన్ 10 లేదా అంతకంటే ఎక్కువ సార్లు పోటీపడవచ్చు. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ సంవత్సరం అంతా సవ్యంగా జరిగితే మహిళల/పురుషుల టోర్నమెంట్‌తో సహా భారత్, పాకిస్తాన్ మధ్య 10 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే ఈ ఏడాది క్రికెట్ పరంగా భారత్-పాక్‌ల మధ్య బోలెడన్ని ఉత్కంఠభరితమైన క్షణాలను చూడవచ్చు.
భారత్, పాకిస్తాన్ వేదికల గొడవ ఏం అవుతుంది?
2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ రాకపోతే, 2023 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ కూడా భారత్‌కు వెళ్లదని పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా చెప్పారు. ప్రస్తుతానికి ఆసియా కప్‌కు భారత జట్టు వెళ్లేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ రెండు దేశాలు ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఒకవేళ టీమిండియా రాకపోతే పాకిస్తాన్ తటస్థ వేదికపై ఆసియా కప్‌ను నిర్వహించవచ్చు.