Viral Video:  నవంబర్ 27వ న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది. ఇందుకోసం జట్టు మ్యాచ్ వేదికైన హామిల్టన్ చేరుకుంది. ఇందులో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మూడు మ్యాచుల సిరీస్ లో మొదటి వన్డేలో భారత్ ఓడిపోయింది. 


హామిల్టన్ చేరుకున్న భారత జట్టులోని యువ పేసర్ అర్షదీప్ సింగ్ భాంగ్రా నృత్యం చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. మొదటి వన్డేలో ఆకట్టుకోలేక పోయిన అర్షదీప్ రెండో వన్డేలో పుంజుకోవాలని భావిస్తున్నాడు.  గత మ్యాచ్ తోనే అర్హదీప్ వన్డే అరంగేట్రం చేశాడు. అయితే ఆ గేమ్ లో ఈ యువ పేసర్ ఆకట్టుకోలేకపోయాడు. వికెట్లు తీయడంలోనూ, పరుగులు నియంత్రించడంలోనూ విఫలమయ్యాడు. 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు.  


సాధారణంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అర్షదీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. అలాగే ప్రభావవంతంగా కనిపిస్తాడు. అయితే మొదటి మ్యాచ్ లో మాత్రం తేలిపోయాడు. రెండో వన్డే జరిగే హోమిల్టన్ మైదానం మొదటి 10 ఓవర్లలో సీమ్ కు అనుకూలిస్తుంది. కాబట్టి ఆ పిచ్ పై అర్షదీప్ కీలకం కానున్నాడు. మొదటి వన్డేలో భారత బౌలర్లు ప్రత్యర్థివి 3 వికెట్లు మాత్రమే తీయగలిగారు. కాబట్టి ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలంటే బౌలర్లందరూ సమష్టిగా రాణించాల్సిందే. 






న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా రెడీ! హ్యామిల్టన్‌ వేదికగా ఆదివారం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. గబ్బర్‌ సేన ఈ సిరీసులో నిలవాలంటే రెండో వన్డేలో కచ్చితంగా గెలవాలి. లేదంటే సిరీస్‌ కివీస్‌ వశం అవుతుంది. మరి ప్రత్యర్థి చేతిలో వరుస ఓటములకు భారత్‌ బదులిచ్చేనా?


బ్యాటింగ్‌ ఓకే!


బ్యాటింగ్‌ పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవ్‌! శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభాలే ఇస్తున్నారు. నిలకడగా ఆడుతూ దూకుడు పెంచుతున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్నాడు. మొన్న దాదాపుగా సెంచరీకి చేరువయ్యాడు. సూర్యకుమార్‌ ఆట తెలిసిందే. ఇంటెంట్‌ మిస్సైందో ఇంకేదైనా ప్రాబ్లమో రిషభ్ పంత్‌ తన స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. అతడి నుంచి ఆశించేది ఒకటైతే ఔట్‌పుట్‌ మరోటి వస్తోంది. సంజూ శాంసన్‌ ఫినిషర్‌ రోల్‌కు ఫిక్సయ్యాడు. పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తొలి వన్డేలో వాషింగ్టన్‌ సుందర్‌ తన దూకుడుతో అదరగొట్టాడు.


బౌలింగ్‌లో ఏదో తేడా!


వికెట్లు తీయడంలో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. కొన్ని మ్యాచుల్లో బాగా రాణిస్తున్న బౌలర్లు కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్నారు. జమ్మూ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు. తన వేగంతో రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్‌ ఫర్వాలేదు. లెఫ్ట్‌ హ్యాండ్‌ సీమర్‌ కావడంతో జట్టులో ఉండటం కీలకం. కొన్నిసార్లు వికెట్లు తీయలేకపోతున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఆశించిన మేరకు రాణించలేదు. కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లేథమ్‌ అతడి బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. బహుశా రెండో వన్డేలో అతడి స్థానంలో దీపక్‌ చాహర్‌ను తీసుకోవచ్చు. సుందర్‌ ఫర్వాలేదు. యూజీ సైతం ఈ మధ్య ఎక్కువ రన్స్‌ ఇస్తున్నాడు.