తొలి వన్డేకు ముందే భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడిన రిషబ్ పంత్  ఆ తర్వాత మైదానాన్ని వీడాల్సి వచ్చింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆదివారం (జనవరి 11న) వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరగనుంది. పంత్‌ గాయానికి సంబంధించిన వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. టీ20 వరల్డ్ కప్ జట్టులో పంత్ సభ్యుడు కాదని తెలిసిందే.

Continues below advertisement

రిషబ్ పంత్ ఆగస్టు 2024లో తన చివరి వన్డే ఆడాడు. పంత్ గత కొంతకాలం నుంచి వరుస గాయాలతో బాధపడుతున్నాడు, ఇంగ్లండ్‌లో కూడా గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే జట్టులో అతను కేఎల్ రాహుల్‌తో పాటు రెండో వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు. కేఎల్ రాహుల్‌ను మొదటి వన్డేలో వికెట్ కీపర్‌గా ఆడించే అవకాశం ఉంది.

రిషబ్ పంత్‌కు గాయం

నివేదికల ప్రకారం, నెట్స్‌లో త్రో డౌన్ స్పెషలిస్టుల ఎదుట ఆడుతున్నప్పుడు రిషబ్ పంత్‌కు గాయమైంది. ఒక బంతి అతని నడుముకు గట్టిగా తగిలింది. ఆ తర్వాత పంత్ స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అయితే, దీనికి ముందు అతను 50 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మంచి టచ్‌లో కనిపించాడు. అయితే, పంత్ గాయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Continues below advertisement

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే ఆదివారం (జనవరి 11న) వడోదరలోని బీసీఏ స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది బీసీసీఐ. ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ కు గాయం కావడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా కేఎల్ రాహుల్‌ ఉంటాడని చర్చ జరుగుతోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

భారత జట్టు

రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జనవరి 11న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో చేస్తారు. జియోహోట్‌స్టార్ (Jio Hotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.