Gill Double Century:


టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో డబుల్‌ సెంచరీ బాదేసిన ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల 132 రోజుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అంతకు ముందు ఇషాన్‌ కిషన్‌ (24 ఏళ్ల 145 రోజులు), రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజులు) చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఉప్పల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచులో 149 బంతుల్లోనే 208 పరుగులు చేశాడు. 19 బౌండరీలు, 9 సిక్సర్లు దంచికొట్టాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది ద్విశతక సంబరాలు చేసుకోవడం ప్రత్యేకం.






ఉప్పల్‌ గడ్డపై శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే! సీనియర్లు, మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌లో ఏకధాటిగా 50 ఓవర్లు ఆడేశాడు. సాధారణంగా హైదరాబాద్‌ వికెట్లో స్లో బంతులను ఎదుర్కోవడం కష్టం. అలాంటిది అతడు సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. మొదట్నుంచీ అతడి బ్యాటింగ్‌లో దూకుడు కనిపించింది. 52 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. 87 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. గిల్‌ 140 కొట్టినప్పుడు మిగతా బ్యాటర్లంతా కలిపి చేసింది 85 పరుగులే అంటే అతడి విధ్వంసం అర్థం చేసుకోవచ్చు.






సెంచరీ తర్వాత గిల్‌ ఆటలో మరింత పదును కనిపించింది. కోహ్లీ, పాండ్య ఔటైనా అతడు వెనకడుగు వేయలేదు. న్యూజిలాండ్‌ షార్ట్‌పిచ్‌, స్లోవర్‌ బంతులతో దాడి చేసినా వెరవలేదు. సింగిల్స్‌, డబుల్స్ తీస్తూ 122 బంతుల్లో 150 అందుకున్నాడు. ఈ క్రమంలో కివీస్‌ పేసర్లు తెలివిగా బంతులేశారు. బౌండరీలు  కొట్టనివ్వలేదు. 47వ ఓవర్‌ తర్వాత గిల్ రెచ్చిపోయాడు. టిక్నర్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే రెండు సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత ఫెర్గూసన్‌ వేసిన తొలి మూడు బంతులను నేరుగా స్టాండ్స్‌లో పెట్టి డబుల్‌ సెంచరీ బాదేశాడు. అదే ఊపు కొనసాగించబోయి 49.2వ బంతికి ఔటయ్యాడు. అయితే కివీస్‌పై అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. ఉప్పల్‌ మైదానంలో సచిన్‌ టాప్‌ స్కోరునూ బ్రేక్‌ చేశాడు.