IND vs NEP: 


ఆసియాకప్‌-2023లో నేపాల్‌ అమేజింగ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటోంది. పసికూనగా తొలిసారి టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు టీమ్‌ఇండియాపై తిరుగులేని ప్రదర్శన చేసింది. 48.2 ఓవర్లకు 230 పరుగులకు ఆలౌటైంది. ప్రపంచంలోని టాప్‌ టీమ్స్‌లో ఒకటైన హిట్‌మ్యాన్‌సేపై మంచి స్కోరే చేసింది. పోరాడగలిగిన టార్గెట్టే ఇచ్చింది. ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ (58; 97 బంతుల్లో 8x4) చక్కని హాఫ్‌ సెంచరీ బాదేశాడు. సోంపాల్‌ కామి (48; 56 బంతుల్లో 1x4 2x6) జస్ట్‌ 2 పరుగుల తేడాతో అర్ధశతకం మిస్సయ్యాడు. మరో ఓపెనర్‌ కుశాల్‌ భూర్తెల్ (38; 25 బంతుల్లో 3x4, 2x6) దూకుడుగా ఆడాడు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ చెరో 3 వికెట్లు తీశాడు.


లేజీ ఫీల్డింగ్‌!


క్యాచులే మ్యాచుల్ని గెలిపిస్తాయి! టీమ్‌ఇండియా దీన్ని మర్చిపోయినట్టుంది. నేపాల్‌ చిన్న జట్టే కదా! ఏం ఆడుతుందిలే అనుకున్నారో ఏమో ఫీల్డర్లంతా మైదానంలో లేజీగా కదిలారు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇచ్చిన మూడు క్యాచుల్ని నేలపాలు చేశారు. ఇంకేముంది నేపాలీలకు అమేజింగ్‌ ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్‌ లభించింది. షమి వేసిన ఇన్నింగ్స్‌ ఆరో బంతికి కుశాల్‌ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 1.1వ బంతిని ఆసిఫ్ ఔటవ్వాల్సింది. షార్ట్‌పిచ్‌ వద్ద కోహ్లీ ఈ సిట్టర్‌ను నేలపాలు చేశాడు. మళ్లీ షమి వేసిన 4.2వ బంతికీ భూర్తెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ మిస్‌ జడ్జ్‌ చేశాడు.  దొరికిన అవకాశాలను వీరిద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం అందించారు. పదో ఓవర్లో గానీ టీమ్‌ఇండియాకు వికెట్‌ దొరకలేదు.


హ్యాట్సాఫ్ సోంపాల్‌!


మొత్తానికి 9.5వ బంతికి కుశాల్‌ను శార్దూల్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వరుసగా భీమ్‌ షాక్రి (7), రోహిత్‌ పౌడెల్‌ (5), కుశాల్‌ (2)ను పెవిలియన్‌కు పంపించాడు. ఈ సిచ్యువేషన్లో గుల్షన్‌ ఝా (23; 35 బంతుల్లో 3x4), దీపేంద్ర సింగ్‌ (29; 25 బంతుల్లో 3x4) ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాకైనా వికెట్ల పతనం మొదలవుతుందని ఆశిస్తే.. వరుణుడు ఎంటరయ్యాడు. వర్షం కురిపించి గంటన్నర పాటు అంతరాయం కలిగించాడు. తిరిగి ఆట మొదలయ్యాక సోంపాల్‌ కామీ ఆడిన తీరు హ్యాట్సాఫ్.  టీమ్‌ఇండియా బౌలర్లను అతడు సమయోచితంగా ఎదుర్కొన్నాడు. దీపేంద్రతో కలిసి సింగిల్స్‌ తీస్తూ ఆరో వికెట్‌కు 56 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 194 వద్ద దీపేంద్రను పాండ్య ఔట్‌ చేశాడు. ఆ తర్వాత సందీప్‌ లామిచాన్‌ (9)తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సొగసైన బౌండరీలు, సిక్సర్లు బాది బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని 47.2వ బంతికి మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 228. మరో 2 పరుగులకే మిగిలిన ఇద్దరూ ఔటవ్వడంతో నేపాల్‌ 230కి పరిమితమైంది.


భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షహి, మహ్మద్‌ సిరాజ్


నేపాల్‌ జట్టు: కుశాల్‌ భూర్తెల్‌, ఆసిఫ్ షేక్‌, రోహిత్‌ పౌడెల్‌, భీమ్‌ షక్రి, సోంపాల్‌ కామి, గుల్షన్‌ ఝా, దీపేంద్ర సింగ్‌, కుశాల్‌ మల్లా, సందీప్‌ లామిచాన్‌, కరన్‌ కేసీ, లలిత్‌ రాజ్‌భాన్షి