IND vs ENG Semi Final T20 WC:  రేపు ఇంగ్లండ్ తో టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. భారత టాపార్డర్ కు నాకౌట్ మ్యాచుల్లో మంచి రికార్డు లేదన్న విలేకర్ల ప్రశ్నకు రోహిత్ ఇలా బదులిచ్చాడు. 'టాప్ 3 మాత్రమే కాదు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు ఏడాదంతా చాలా కష్టపడతాడు. జట్టు గెలుపు కోసం తన ఉత్తమ ప్రదర్శన చేయడానికి చూస్తాడు. అయితే ఒక్క నాకౌట్ మ్యాచులో సరిగ్గా ఆడనంత మాత్రాన ఆ ఆటగాడి ప్రదర్శనను తక్కువ చేయకూడదు' అని రోహిత్ అన్నాడు. నాకౌట్ మ్యాచ్ ముఖ్యమన్న విషయం తమకు తెలుసునని.. అయితే ఆ క్రమంలో ఆటగాళ్ల ఏడాది శ్రమను మరచిపోకూడదని చెప్పుకొచ్చాడు. 


ఈ టోర్నీ ఛాలెంజింగ్ గా ఉంది


ఈ టీ20 ప్రపంచకప్ ఛాలెంజింగ్ గా జరిగిందని టీమిండియా సారథి అన్నాడు. ఇక్కడ ఒక్కో మైదానంలో బౌండరీ లైను ఒక్కోలా ఉందని.. దానికి అనుగుణంగా తమని తాము మార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదని రోహిత్ గుర్తుచేశాడు. అయినా కూడా ఒత్తిడిని చాలా బాగా ఎదుర్కొన్నారని ప్రశంసించాడు. అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల ఆందోళన ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇలా చెప్పాడు. అక్షర్ మెగా టోర్నీలో పూర్తిగా బౌలింగ్ చేయలేదన్నాడు. నెదర్లాండ్స్ తో మ్యాచులో తప్పిస్తే మిగతా మ్యాచుల్లో తన కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేయలేదని చెప్పాడు. అయినా 2, 3 మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాడు.


సూర్య అనవసర బ్యాగేజ్ ను మోయడు


సూర్యకుమార్ ఎటాకింగ్ బ్యాటింగ్ పైన రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అలానే అతనిపై ఓ జోక్ వేశాడు. సూర్య షాపింగ్ ఎక్కువగా చేసి ఆ బ్యాగులను మోస్తాడని.. అయితే మెంటల్ బ్యాగేజీని మాత్రం అస్సలు మోయడని పొగిడాడు. 10 పరుగులకు 2 వికెట్లు పడ్డా.. 100 పరుగులకు 2 వికెట్లు పడ్డా సూర్య బ్యాటింగ్ స్టైల్ ఒకేలా ఉంటుందన్నాడు. తన ప్రభావంతో ఇతర ఆటగాళ్లు పాజిటివ్ దృక్పథంతో ఉంటారని అన్నాడు. ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో ఆడడాన్ని సూర్య ఆస్వాదిస్తున్నాడని రోహిత్ అన్నాడు. 


వారిద్దరికీ అవకాశాలు రావొచ్చు


వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ఇద్దరు సెమీస్ లో ఆడే అవకాశముండొచ్చని రోహిత్ చెప్పాడు. పంత్ కు గేమ్ టైం లేదని.. అందుకే జింబాబ్వేతో మ్యాచులో ఆడించామన్నాడు. పంత్, కార్తీక్ లలో రేపు ఎవరు ఆడతారో చెప్పలేమని.. ప్రస్తుతానికి ఇద్దరికీ అవకాశముందన్నారు. ఎవరు తుది జట్టులో ఉంటారనేది మ్యాచ్ సమయంలోనే తెలుస్తుందన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ లో జరిగిన టీ20 సిరీస్ లో ఆ జట్టును ఓడించడం కచ్చితంగా తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నాడు. అయితే టీ20 లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు. రికార్డులు లెక్కలోకి రావని.. ఆరోజు ఎవరు ఎలా ఆడారన్నదే ముఖ్యమని అన్నాడు. దాన్ని బట్టే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయని వివరించాడు.