ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు టీబ్రేక్ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. జో రూట్ (19 బ్యాటింగ్: 38 బంతుల్లో, రెండు ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (6 బ్యాటింగ్: 13 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇంకా 356 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ అయింది.


ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ లీస్‌ను (6: 9 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుట్ చేసిన బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), ఓలీ పోప్ (10: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


జో రూట్, జానీ బెయిర్‌స్టో మరో నాలుగు ఓవర్ల వరకు వికెట్ పడకుండా కోల్పోయారు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసి టీ బ్రేక్‌ను ప్రకటించారు. వర్షం ఆగడంతో మ్యాచ్ కాసేపట్లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారత బౌలర్లలో తీసిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి.