IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పోరాడినా 22 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. స్టార్ ఆల్ రౌండర్ జడేజా మూడో టెస్టు మ్యాచ్‌లోని 2 ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ కీలకమైన చివరి నిమిషాలలో భారీ షాట్లు ఆడటానికి ఆసక్తి చూపలేదు. దీనిపై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు జడేజా ఆటతీరుపై ప్రశ్నించారు. జడేజా కొంచెం రిస్క్ తీసుకోకూడదా? అని ప్రశ్నలు లేవనెత్తారు. హీరోచితంగా పోరాడినా మనకు అనుకూల ఫలితం రాకపోవడంతో జడేజాపై విమర్శలు, ప్రశ్నలకు చతేశ్వర్ పుజారా సమాధానం ఇచ్చాడు. జడేజా తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు.

పుజారా కీలక ప్రకటన

చతేశ్వర్ పుజారా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితి, మ్యాచ్ లో భారత కండీషన్ బట్టి జడేజా ఎలా బ్యాటింగ్ చేశాడని స్పష్టం చేశాడు. ఆ సమయంలో పరిస్థితికి తగ్గట్లుగా ఆడినా, జడేజా వేగంగా ఆడలేకపోయాడు. అసలే బంతి మెత్తబడింది. పిచ్ కూడా నెమ్మదిగా ఉంది. పైగా, అతనితో మరో ఎండ్ లో టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, తక్కువ టార్గెట్ కావడంతో ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ బ్యాటింగ్ చేశాడు. వీలు చిక్కినప్పుడు ఓవర్ కు ఓసారి స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌలర్లు తక్కువ బంతులు స్ట్రైకింగ్ తీసుకునేలా బ్యాటింగ్ ఆడాడు. అవకాశం వచ్చినప్పుడు వేగంగా ఆడాలని జడేజా భావించి ఉంటాడు. అతను పరిస్థితులను అర్థం చేసుకుని తెలివిగా బ్యాటింగ్ చేశాడని’ అన్నారు.

ఆడటానికి అవకాశం ఉంది, కానీ..

మిడాఫ్, కవర్స్ మధ్య ఖచ్చితంగా ఎక్కువ స్పేస్ ఉందని, ఆ వైపు జడేజా బంతిని తరలించాలని చూసే ఛాన్స్ ఉందని పుజారా అంగీకరించాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ బౌలర్లు ఆ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదని, దానివల్ల జడేజాకు ఆ దిశగా ఆ షాట్ ఆడటానికి వీలు కాలేదని అన్నాడు. బంతి మెత్తబడినప్పుడు అలా ఆడటం కూడా ఈజీ కాదు. జడేజా టెక్నిక్ ఇప్పుడు గతంలో కంటే మెరుగైంది. అతను ఇప్పుడు స్పిన్‌ను మాత్రమే కాకుండా, ఫాస్ట్ బౌలర్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తున్నాడని జడేజాపై ప్రశంసలు కురిపించాడు.

టెస్ట్ సిరీస్‌లో జడేజా హవా

రవీంద్ర జడేజా తాజాగా టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 109 సగటుతో ఏకంగా 327 పరుగులు చేశాడు. జడేజా వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు చేశాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడని ఇది నిరూపిస్తుంది. అది కూడా ఇంగ్లాండ్ గడ్డమీద స్టార్ బ్యాటర్లకు మాత్రమే సాధ్యమయ్యే రికార్డు ఇది

మాంచెస్టర్ టెస్ట్‌లో..

సిరీస్‌లో చివరి టెస్ట్ మాంచెస్టర్ వేదికగా రవీంద్ర జడేజా నుండి మరో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను భారత అభిమానులు ఆశిస్తున్నారు. స్టార్ బ్యాటర్లతో పోటీ పడి ఆల్ రౌండర్ జడేజా పరుగులు సాధిస్తున్నాడు.