IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌(England)తో జరుగనున్న  మూడో టెస్ట్‌కు టీమిండియా(Team India) సిద్ధం అవుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లాండ్‌లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. వైజాగ్‌ టెస్ట్‌ తర్వాత కాసింత విశ్రాంతి తీసుకున్న ఇరు జట్లు మళ్లీ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాయి. ఇరు జట్ల క్రికెటర్లు మంగళవారం ముమ్మర ప్రాక్టీస్‌ చేశారు. రాజ్‌ కోట్‌ టెస్ట్‌లో గెలిచి ఎలాగైనా ఆధిక్యం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తున్న ఇరు జట్లు... పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో మరోమారు ఆసక్తిపోరుకు ఆస్కారముంది. సొంతగడ్డపై తమదే పైచేయి అనుకున్న టీమ్‌ఇండియాకు ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ వ్యూహంతో దీటైన పోటీనిస్తున్నది. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ఖాన్‌, ధృవ్‌ జురెల్‌, దేవదత్‌ పడిక్కల్‌ లాంటి యువ క్రికెటర్లు అవకాశం ఎదురుచూస్తున్నారు. సీనియర్ల గైర్హాజరీలో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే విశాఖ టెస్టు ద్వారా రజత్‌ పాటిదార్‌ అరంగేట్రం చేయగా, రాజ్‌కోట్‌ టెస్టులో ధృవ్‌ జురేల్‌, సర్ఫరాజ్‌ఖాన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. 

 

ఇంగ్లాండ్‌ సారధి ఘనత

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగనున్న  మూడో టెస్ట్‌కు టీమిండియా సిద్ధం అవుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లాండ్‌లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్‌తో బ్రిటీష్‌ జట్టు సారధి బెన్‌ స్టోక్స్‌ వంద టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. స్టోక్స్‌కు రాజ్‌కోట్‌ టెస్ట్‌ వందో టెస్టు మ్యాచ్‌ కానుంది. వైజాగ్‌ వేదికగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టుతో స్టోక్స్‌ 99 టెస్టులు ఆడేశాడు. దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్‌ రాజ్‌కోట్‌ టెస్టును మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టుతో ఈ ఫార్మాట్‌లో ‘సెంచరీ’ కొట్టబోతున్న స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తరఫున 15వ క్రికెటర్‌గా నిలుస్తాడు. 

 

ఇంగ్లాండ్‌ తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాళ్లు

జేమ్స్‌ అండర్సన్‌ -184

స్టువర్ట్‌ బ్రాడ్‌ -167

అలెస్టర్‌ కుక్‌ -161

జో రూట్‌ -137

అలెక్‌ స్టీవార్ట్‌ -133

గ్రాహం గూచ్‌ -118

ఇయాన్‌ బెల్‌ -118

డేవిడ్‌ గోవర్‌ -117

మైఖెల్‌ అథర్టన్‌ -115

కొలిన్‌ కౌడ్రే -114

జెఫ్రీ బాయ్‌కట్‌ -108

కెవిన్‌ పీటర్సన్‌ -104

ఇయాన్‌ బోథమ్‌ -102

గ్రాహమ్‌ థోర్ప్‌ -100

ఆండ్రూ స్ట్రాస్‌ -100

ప్రస్తుతం ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో అండర్సన్‌, రూట్‌ మాత్రమే ఉన్నారు. . స్టోక్స్‌ కూడా సెంచరీ క్లబ్‌ లో చేరుతుండటంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ ఏకంగా ముగ్గురు శతాధిక టెస్టులు ఆడిన క్రికెటర్లతో ఆడే జట్టుతో నిలిచే అవకాశముంది. ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన స్టోక్స్‌.. 6,251 పరుగులు చేశాడు. 36.34 సగటుతో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వస్‌ కలిస్‌ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్‌ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్‌ ఉన్నాడు.