David Warner News: కెరీర్‌ చరమాంకంలో ఉన్న ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరుగబోయే టీ20 వరల్డ్‌ కప్‌(T20 World Cup) తర్వాత రిటైర్‌ అవుతానని చెప్పిన వార్నర్‌... సొంత గడ్డపై చివరి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడేశాడు. ఇక డేవిడ్‌ భాయ్‌ మెరుపులు సొంత దేశంలో కనిపించవు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో 49 బంతుల్లోనే 81 పరుగులు చేసిన వార్నర్‌... పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా నిలిచాడు. జాతీయ జట్టుతోపాటు పలు లీగ్స్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న వార్నర్‌.. మూడో టీ20కి ముందు 48 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేయడంతో అతడు 12వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. పొట్టి క్రికెట్‌లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్నవారిలో ఓవరాల్‌గా ఐదో స్థానంలో వార్నర్‌ ఉన్నాడు. ఆస్ట్రేలియా నుంచి మాత్రం ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులెకెక్కాడు.



 12 వేల పరుగుల బ్యాటర్లు
 టీ 20 క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారి జాబితాలో క్రిస్‌ గేల్‌, షోయభ్‌ మాలిక్‌, కీరన్‌ పొలార్డ్‌, అలెక్స్‌ హేల్స్‌లు ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి వార్నర్‌ చేరాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌ వార్నర్‌. క్రిస్‌ గేల్‌ 343 మ్యాచ్‌లలో ఈ ఘనత అందుకోగా వార్నర్‌ 368 మ్యాచ్‌లలో చేశాడు. అలెక్స్‌ హేల్స్‌ (435 మ్యాచ్‌లు), షోయభ్‌ మాలిక్‌ (486)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున టీ20లలో మూడు వేల పరుగుల మైలురాయిని దాటిన రెండో క్రికెటర్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ జాబితాలో ఆరోన్‌ ఫించ్‌.. అగ్రస్థానంలో ఉన్నాడు. ఫించ్‌.. 103 మ్యాచ్‌లలో 3,120 పరుగులు చేయగా.. వార్నర్‌ 102 మ్యాచ్‌లలో 3,067 రన్స్‌ చేశాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (4,037), రోహిత్‌ శర్మ (3974)లు అగ్రస్థానాల్లో ఉన్నారు. 


రిటైర్‌ తర్వాత ప్లాన్‌ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడతానని ఇప్పటికే ప్రకటించిన వార్నర్‌.. ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో కోచ్‌గా కూడా వచ్చే అవకాశముందని, తనకూ ఆ ఆసక్తి ఉందని వార్నర్‌ తెలిపాడు. భవిష్యత్తులో క్రికెట్‌ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తానని వార్నర్‌ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌ తర్వాత ఫాక్స్‌ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నేను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉందని... భవిష్యత్తులో తన ఆశయం కూడా అదేనని అన్నాడు. దీని గురించి ఇప్పటికే తన భార్యతో మాట్లాడానని వార్నర్‌ తెలిపాడు. ‘అవును. నేను ఫ్యూచర్‌లో కోచ్‌గా రావాలనుకుంటున్నాను. అయితే నా భార్యను అనుమతి అడగాలి. కోచ్‌గా ఉండాలంటే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా.. అందుకే ఆమె అనుమతి తప్పనిసరి..’ అంటూ వార్నర్‌ ఫన్నీగా వ్యాఖ్యానించాడు.