India vs England 2nd Test At Vizag: విశాఖ‌(Visakhapatnam) వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా(Team India) భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) అజేయ సెంచరీతో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. తొలి టెస్టులో కొద్దిలో సెంచ‌రీ చేజార్చుకున్న యశస్వీ జైస్వాల్‌ వైజాగ్‌లో శతక నినాదం చేశాడు. లంచ్ త‌ర్వాత ఇంగ్లండ్ బౌల‌ర్లపై విరుచుకుపడిన య‌శ‌స్వీ... సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో రెండో సెంచ‌రీ ఖాతాలో వేసుకున్నాడు. సొంత‌గ‌డ్డపై యశస్వికి ఇదే తొలి టెస్టు శ‌త‌కం.  గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అతడు అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. య‌శ‌స్వీ జోరుతో భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. 


మ్యాచ్‌ సాగిందిలా...
ట‌స్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 40 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. డెబ్యూ క్యాప్ అందుకున్న స్పిన్నర్ బ‌షీర్ నాలుగో ఓవ‌ర్లోనే విధ్వంసకర ఆటగాడు రోహిత్‌ శర్మను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. 14 పరుగులకే రోహిత్‌ అవుటయ్యాడు. గిల్(34), య‌శ‌స్వీ ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 49 ర‌న్స్ జోడించారు. అండ‌ర్సన్ సూప‌ర్ డెలివ‌రీతో 89 ప‌రుగుల వ‌ద్ద గిల్‌ను బోల్తా కొట్టించాడు. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌... సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్‌ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం. గమనార్హం. ప్రస్తుతం టీమిండియా 67 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా నడుస్తోంది. జైస్వాల్ 194 బంతుల్లో 129 పరుగులతో జైస్వాల్‌ ఆడుతున్నాడు.


అనుమానమేనా....?
తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన  రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్‌ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది. 


విరాట్‌ వచ్చేస్తాడా..?
మూడో టెస్ట్‌(Third Test) నుంచి అందుబాటులో ఉంటాడనుకున్న స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(Virat Kohli) నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తుంది. విరాట్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇప్పటికే దూరమైన కోహ్లీ... తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి.