ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 100 పరుగులతో ఘోర పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అవ్వగా... అనంతరం టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లే (6/24) ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో విజయం సాధించిన జట్టుకు సిరీస్ దక్కనుంది.
246కే ఇంగ్లండ్ ఆలౌట్
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వరకు సాఫీగానే సాగింది. ఓపెనర్ జేసన్ రాయ్‌ను (23: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ చేసి హార్దిక్ పాండ్యా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వికెట్లను తీసే బాధ్యతను స్పిన్నర్ చాహల్ తీసుకున్నాడు. కీలకమైన జానీ బెయిర్‌స్టో (38: 38 బంతుల్లో, ఆరు ఫోర్లు), జో రూట్ (11: 21 బంతుల్లో), బెన్ స్టోక్స్‌ల (21: 23 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్లను చాహల్ తీసుకోగా... డేంజరస్ బట్లర్‌ను (4: 5 బంతుల్లో) షమీ అవుట్ చేశాడు. ఈ నాలుగు వికెట్లు ఏడు ఓవర్ల వ్యవధిలోనే పడ్డాయి. సగం జట్టు ఇంటి బాట పట్టేసరికి ఇంగ్లండ్ స్కోరు 102 పరుగులు మాత్రమే.
అయితే ఇక్కడ ఇంగ్లండ్ రెండు కీలక భాగస్వామ్యాలను ఏర్పరిచింది. ఆరో వికెట్‌కు లివింగ్‌స్టోన్ (33: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ 46 పరుగులు జోడించారు. లివింగ్‌స్టోన్ అవుటయ్యాక డేవిడ్ విల్లేతో (41: 49 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి మొయిన్ అలీ ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది. అయితే లోయర్ ఆర్డర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో చాహల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి, మహ్మద్ షమీ, ప్రసీద్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.
టాప్లే షో..
247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 31 పరుగులకే రోహిత్ శర్మ (0: 10 బంతుల్లో), శిఖర్ ధావన్ (9: 26 బంతుల్లో, ఒక ఫోర్), విరాట్ కోహ్లీ (16: 25 బంతుల్లో, మూడు ఫోర్లు), రిషబ్ పంత్‌ల (0: 5 బంతుల్లో) వికెట్లను భారత్ కోల్పోయింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (27: 29 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్యా (29: 44 బంతుల్లో, రెండు ఫోర్లు), రవీంద్ర జడేజా (29: 44 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), మహ్మద్ షమీ (23: 28 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ప్రయోజనం లేకపోయింది.
రీస్ టాప్లే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారీ భాగస్వామ్యాలు ఏర్పడకుండా అడ్డుకున్నాడు. దీంతో టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే కేవలం 24 పరుగులకే ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ వన్డే చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్‌లకు తలో వికెట్ దక్కింది.