ఇంగ్లాండ్‌(England)తో టెస్ట్‌ సిరీస్‌లో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌(Kl Rahul)ను తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే తీసుకుంటారా అన్న అనుమానాలకు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్పష్టత ఇచ్చారు. ఈ టెస్ట్ సిరీస్‌లో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ప్రకటనతో ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌(Ks.Bharat)... రెండు టెస్టుల మ్యాచులో వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

రేపటి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. రాహుల్‌ కీపింగ్‌పై స్పష్టత ఇచ్చేశాడు. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని,  జట్టు ఎంపిక సమయంలోనే దీనిపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు. రాహుల్‌ కాకుండా మరో ఇద్దరు వికెట్‌ కీపర్లను జట్టుకు ఎంపిక చేశామని, అయిదు టెస్టు మ్యాచ్‌లు ఉండటం.. భారత్‌లో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రాహుల్‌ కాకుండా కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌లను జట్టులోకి తీసుకున్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు. ఇక తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్‌ స్టేడియం పిచ్‌ స్పిన్‌కు అనుకూలించొచ్చని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఉప్పల్‌ పిచ్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రావడం కష్టమన్న ద్రవిడ్‌ మ్యాచ్‌ ప్రారంభమైతే ఎలా స్పందిస్తుందో తెలుస్తుందన్నాడు. పిచ్‌ బాగుందని  కొంచెం స్పిన్‌ తిరగొచ్చని ఎంత త్వరగా ఎంత వేగంగా అన్నది కచ్చితంగా చెప్పలేనని ద్రవిడ్‌ అన్నాడు.

 

కొంతకాలంగా ఇంగ్లాండ్‌ బాగా ఆడుతోందని దూకుడు ఆట చూడటం ఉత్సాహంగా అనిపిస్తుందని ద్రవిడ్‌ అన్నాడు. కానీ భారత్‌లో పరిస్థితులు ఇంగ్లాండ్‌ జట్టుకు సవాలే అన్న టీమిండియా హెడ్‌ కోచ్‌... ఇక్కడి పరిస్థితులపై తమకు మంచి అవగాహన ఉందని ద్రవిడ్‌ తెలిపాడు. ప్రణాళిక ప్రకారం.. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ ఉంటుందని ద్రవిడ్‌ తెలిపాడు. 

 

చోటు భరత్‌కేనా..?

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్‌లో స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ కోటాలో భరత్‌ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్‌ కీపర్‌ దృవ్‌ జురల్‌కు కూడా జట్టులో ఛాన్స్‌ లభించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌.. ఈ సిరీస్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఈ సెంచరీతో భరత్‌కు వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌(England)తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌( Srikar Bharat) అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా ఎ – ఇంగ్లండ్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌ సంచలన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్‌.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు.

 

మ్యాచ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. రేపు ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association) అధ్యక్షడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్లడించారు.