IND vs BAN Match Weather:  ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా నేడు నాలుగో మ్యాచ్‌ ఆడుతోంది. అడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆట మొదలవుతుంది. అరగంట ముందు టాస్‌ వేస్తారు. ఆస్ట్రేలియాలో వరుసగా వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచుపై సందిగ్ధం నెలకొంది.




మ్యాచుకు ఓకే!


అభిమానులకు శుభవార్త! అడిలైడ్‌ మ్యాచ్‌ పూర్తిగా జరిగే అవకాశం ఉంది. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నప్పటికీ రాత్రి 8 గంటల వరకు వర్షం కురవదని వాతావరణం శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వచ్చినా చిన్నపాటి జల్లులే కురుస్తాయని అంటున్నారు. అడిలైడ్‌లోనే ఉన్న రవిశాస్త్రి, ఇతర స్థానికులు సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మబ్బులు ఉన్నాయని, ఉదయం నుంచి వర్షం కురవలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




జల్లులు కురవొచ్చు!


అడిలైడ్‌లో మధ్యాహ్నం 9, సాయంత్రం 30, అర్ధరాత్రి 7 శాతం మేర వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్‌.కామ్‌ అంచనా వేసింది. వర్షం కురిసినా కురవకపోయినా వాతావరణం చల్లగా ఉండనుంది. అతి వేగంగా శీతల గాలులు వీస్తాయి. అంటే సీమర్లు మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తారు. ఇదే వేదికలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియా 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మరోవైపు బంగ్లాలోనూ తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ బంతిని చక్కగా స్వింగ్‌, సీమ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా తరహాలో బౌలింగ్‌ చేస్తే హిట్‌మ్యాన్‌ సేనకు కష్టాలు తప్పవు.


పేసర్లతో డేంజర్‌!


ఈ స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉపయోగిస్తున్నారు. అందుకే బంతి, బ్యాటు మధ్య ఇవి సమతూకం అందిస్తాయి. అయితే ఎక్కువ బ్యాటర్లు పిచ్‌ను ఆస్వాదిస్తారు. సిడ్నీతో పాటు అడిలైడ్‌ పిచ్‌పై ఉపఖండం బ్యాటర్లు పరుగులు చేస్తున్నారు. అలాగే పేసర్లకు చక్కని వేగంతో బంతులు వేస్తారు.