IND vs BAN:


ఆసియాకప్‌ 2023లో టీమ్‌ఇండియా నేడు ఆఖరి సూపర్‌ 4 మ్యాచ్‌ ఆడుతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.


'మేం మొదట బౌలింగ్ చేస్తాం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు తొలుత బౌలింగ్‌ చేయలేదు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో ఎలా బ్యాటింగ్‌ చేస్తామో పరీక్షించాలని అనుకుంటున్నాం. పగటి పూటా పేసర్లు ప్రభావం చూపిస్తున్నారు. బంతిని స్వింగ్‌ చేస్తున్నారు. ఇక స్పిన్నర్లకూ వికెట్‌ నుంచి సహకారం లభిస్తోంఇ. తటస్థంగా ఆడాలంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పటి వరకు ఆడని ఆటగాళ్లకు కాస్త గేమ్‌ టైమ్‌ ఇవ్వాల్సి ఉంది. అందుకే జట్టులో ఐదు మార్పులు చేశాం. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఆడటం లేదు. తిలక్‌ వర్మ అరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్‌ షమి, ప్రసిద్ధ్‌ కృష్ణ వచ్చారు. సూర్యకుమార్‌ మిడిలార్డర్లో వస్తాడు' అని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.


'ఒకవేళ టాస్ గెలిస్తే ఏం చేయాలన్న దానిపై నాకు స్పష్టత లేదు. మొదట బ్యాటింగ్‌ చేసినా ఇబ్బందేమీ లేదు. ఇప్పటి వరకు ఆడని వారికి అవకాశాలు కల్పించాం. తంజిమ్‌ అరంగేట్రం చేస్తున్నాడు. ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఈ టోర్నీ మాకు కనువిప్పు కలిగించింది. వన్డే ప్రపంచకప్‌ ముందు అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తెలిపాడు.


బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్‌ దాస్‌, తంజిద్‌ హసన్‌, అనముల్‌ హఖ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, తోహిడ్‌ హృదయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, మెహెదీ హసన్‌ మిరాజ్‌, మెహెదీ హసన్‌, నసుమ్‌ అహ్మద్‌, తంజిమ్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌


పిచ్‌ రిపోర్ట్‌: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడిన వికెట్‌నే ఇచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్పిన్నర్లు రాణిస్తున్నారు. 21.1 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. వికెట్‌పై పచ్చిక ఉంది. మంచి బౌన్స్‌ లభిస్తుంది. స్పిన్నర్లు ప్రభావం చూపించినా బ్యాటర్లకు అనుకూలిస్తుంది.


గ్రూప్ స్టేజ్‌లో నేపాల్‌ను ఓడించి సూపర్ - 4లో  పాకిస్తాన్, శ్రీలంకలనూ మట్టికరిపించిన  భారత జట్టు ఆసియా కప్‌లో ఇదివరకే ఫైనల్ చేరిన నేపథ్యంలో బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకుంటోంది.  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,  శుభ్‌మన్ గిల్‌లు   కీలకటోర్నీకి ముందు  ఫామ్‌లోకి రావడం భారత్‌కు మేలుచేసేదే.  ఇషాన్ కిషన్  నిలకడగా రాణిస్తుండటం, కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని  జట్టులోకి తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన నేపథ్యంలో ఇక  మిగిలిఉన్న ఖాళీలను పూరించడానికి టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఈ  మ్యాచ్‌లో అవకాశమివ్వాలని టీమిండియా భావిస్తోంది. 


బౌలింగ్‌లో  కూడా బుమ్రా  జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే గాక ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమై‌నట్టే కనిపిస్తున్నది. సిరాజ్  ఫామ్ కొనసాగిస్తున్నాడు.  అయితే షమీ, శార్దూల్ ఠాకూర్‌లు ఇంకా కుదురుకోలేదు.  గత రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన షమీకి ఈ  మ్యాచ్‌లో ఛాన్స్ ఇవ్వొచ్చు.  బుమ్రాకు  నేటి మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి.