Ravichandran Ashwin:

  బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియాల మధ్య 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే 2 మ్యాచులు జరగ్గా అందులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ 2 టెస్టులు 3 రోజుల్లోనే ముగిసిపోయాయి. భారత స్పిన్నర్ల ధాటికి నిలవలేకపోయిన ఆసీస్ బ్యాటర్లు మొత్తం 6  రోజుల్లోనే 2 టెస్టులను భారత్ కు అప్పగించేశారు. మన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు ఆస్ట్రేలియాను తిప్పేశారు. 


ఈ సిరీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ట్రోఫీని నిలబెట్టుకుంది. ఇప్పటికే సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభమవనుంది. రెండు టెస్ట్ మ్యాచులు 3 రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో స్పిన్నర్ అశ్విన్ కు ఒక వ్యక్తి నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైందట. మరి ఆ ప్రశ్న ఏంటో? దానికి మన యాష్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా..






3 రోజుల్లోనే ఎందుకు?


ఆసీస్ తో రెండో టెస్ట్ ముగిసిన అనంతరం.. జట్టు సభ్యులందరూ ఢిల్లీ నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు తోటి ప్రయాణికుడి నుంచి అశ్విన్ కు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు 3 రోజుల్లోనే మ్యాచ్ లను ఎందుకు ముగించారు. దానివలన నేను చాలా నిరాశకు గురయ్యాను' అని ఆ ప్యాసింజర్ అశ్విన్ ను ప్రశ్నించాడట. దానికి అశ్విన్ బదులిస్తూ.. 'రెండు విషయాల్లో మార్పు వచ్చింది. సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడడం, వేగంగా పరుగులు చేయడం వంటి వాటిల్లో బ్యాటర్ల మైండ్ సెట్ మారిపోయింది. ఈ రోజుల్లో టెస్ట్ మ్యాచుల్లోనూ వేగంగా పరుగులు రాబట్టాలని చూస్తున్నారు. సమయం తీసుకుని, క్రీజులో కుదురుకుని నెమ్మదిగా రన్స్ చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. అయితే ఈ 2 టెస్టులు 3 రోజుల్లోనే ముగిసి ఉండకూడదు.' అని అశ్విన్ చెప్పాడు. 


మూడో టెస్ట్ మ్యాచ్ కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమయ్యాడు. అతను వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక టీమిండియా సూపర్ ఫాంలో ఉంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా సత్తా చాటుతూ రాణిస్తున్నారు. సిరీస్ లో ఆధిక్యంలో ఉన్న భారత్ కు అడ్డుకట్ట వేయాలంటే చాలా శ్రమించాల్సి ఉంది.