Rishabh Pant: గతేడాది డిసెంబర్ 30న భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న పంత్ కోలుకుంటున్నాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా పంత్ దాదాపు ఈ ఏడాది క్రికెట్ కు దూరం కానున్నాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ రిషభ్ పంత్ ఆడడంలేడు. దీనిపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టయినిస్ స్పందించాడు. ఈ సిరీస్ లో రిషభ్ పంత్ ను మిస్ అవుతామని అతను అన్నాడు.
ఫిబ్రవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 9న నాగ్ పూర్ లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. 2016- 2017 తర్వాత ఆస్ట్రేలియా టెస్టుల కోసం భారత్ కు రావడం ఇదే తొలిసారి. అలాగే 2015 తర్వాత ఆసీస్ జట్టు టీమిండియాపై టెస్ట్ సిరీస్ విజయం సాధించలేదు. 2016- 17 సిరీస్ ను 2-1 తో గెలిచిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది.
ఆ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఘోర పరాజయం చవిచూశాక భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వచ్చేశాడు. అనంతరం అజింక్య రహాన్ సారథ్యంలోని టీమిండియా ఆసీస్ ను 2 టెస్టుల్లో ఓడించి సిరీస్ ను చేజిక్కించుకుంది. ఆ సిరీస్ విజయంలో చాలామంది ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా భారత యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ గబ్బాలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. అప్పటినుంచి పంత్ టెస్ట్ కెరీర్ పరగందుకుంది. అలాగే రాబోయే సుదీర్ఘ ఫార్మాట్ సిరీసుల్లో పంత్ ప్రధాన పాత్ర పోషిస్తాడని చాలామంది అనుకున్నారు. అయితే రోడ్డు ప్రమాదంతో పంత్ ఈ ఏడాది క్రికెట్ కు దూరమవనున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టయినిస్ స్పందించాడు.
పంత్ త్వరగా కోలుకోవాలి
ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ లో పంత్, స్టయినిస్ కలిసి ఆడుతున్నారు. పంత్ ఆరోగ్యంపై స్టయినిస్ మాట్లాడుతూ.. అతను త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నానని అన్నాడు. 'ఈ సీజన్ లో ఒక ఆటగాడిని కచ్చితంగా మిస్ అవుతాం. దురదృష్టవశాత్తూ అతడు భారత జట్టులో లేడు. రిషభ్ పంత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి రావాలని కోరుకుంటున్నాను.' అని ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ అన్నాడు. స్టయినిస్ ఆసీస్ టెస్ట్ జట్టులో లేడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అతను భాగమయ్యాడు.
మేం స్పెషలిస్టులతోనే వస్తున్నాం
బోర్డర్- గావస్కర్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. 'ఈసారి ట్రోఫీని కోల్పోవాలని మేం అనుకోవడం లేదు. అలా జట్టు ఎప్పుడూ కోరుకోదు. ప్రస్తుతం మా జట్టు చాలా బలంగా ఉంది. అయితే భారత జట్టు తన సొంత గడ్డపై ఆడుతోంది. ఇది కచ్చితంగా వారికి సానుకూలాంశం. అక్కడి స్పిన్ పిచ్ లను ఎదుర్కోవడం కొంచెం కష్టమే. అశ్విన్, జడేజా వంటి స్పెషలిస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తారు. అయితే మేం కూడా కొందరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే వస్తున్నాం కాబట్టి ఈసారి మంచి పోటీని ఆశించవచ్చు.' అని స్టయినిస్ అన్నాడు.