Time for Revenge:  ఈ నక్కల వేట ఎంతసేపు... ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా... RRR సినిమాలో రామ్‌చరణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. అఫ్గాన్‌(Afghan), బంగ్లాదేశ్‌(Bangladesh) పై విజయాలు సాధించాం సరే. మరి ఇప్పుడు ఆ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టాల్సిందే. వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లో లక్షలాది మందికి భారత అభిమానులకు కన్నీళ్లను మిగులుస్తామని చెప్పి మరీ ఓడించిన ఆస్ట్రేలియా( Australia)ను ఇక ఇంటిదారి పట్టించే సమయం వచ్చేసింది. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన ఓటమికి రోహిత్‌ సేన ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. భారత అభిమానుల కన్నీళ్లకు.. ఆటగాళ్ల తీవ్ర మనోవేదనకు గట్టి సమాధానం చెప్పేందుకు రోహిత్‌ సేన సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌లో తుది మెట్టుపై ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్‌లో బదులు తీర్చుకునేందుకు పటిష్టమైన భారత్‌ సిద్ధంగా ఉంది.
 

మీకు గుర్తింది కదా...

మీకు గుర్తుందా... 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయం. లక్షలాది మంది చూస్తుండగా.. స్టేడియాన్ని నిశ్శబ్ధం చేస్తూ..వన్డే ప్రపంచకప్‌ను ఒడిసి పడతామని మ్యాచ్‌కు ముందే ప్రకటించిన కెప్టెన్‌ కమిన్స్‌..దాన్ని అక్షరాల చేసి చూపించాడు. ఇప్పుడు మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ కూడా ఇలాంటి హెచ్చరికే చేశాడు. అఫ్గాన్‌తో ఓడిపోయిన అనంతరం తమతో టీమిండియాకు అంత ఈజీ కాదని హెచ్చరించాడు. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్లకు చెప్పి కొట్టడం అలవాటు. ఈ అలవాటును మార్చి గట్టి బుద్ధి చెప్పాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఎమోషన్ ను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేసుకున్న రోహిత్‌ శర్మ... ఆ బాధ ఎలా ఉంటుందో కంగారులకు రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. కంగారులను ఇంటికి పంపే ఒక్క అవకాశం రాకపోతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన భారత ఆటగాళ్లకు అభిమానులకు ఆ సమయం రానే వచ్చింది. ఇక టీమిండియా ఆడుతుంటే కళ్లారా చూద్దామని అభిమానులు... కసితీరా కొట్టాలని బ్యాటర్లు... బంతితో నిప్పులు చెరగాలని బౌలర్లు ఎదురుచూస్తున్నారు. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సైలెంట్ చేయటంలో వచ్చే మజాను అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు మన వంతు. దానికి రెట్టింపుగా... తిరిగిఇచ్చేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఇప్పుడు రివెంజ్ చేసే టైమ్ మనకు వచ్చింది. టీమిండియా కసిగా ఆడి ఆసీస్ ను ఓడిస్తే చాలు...కంగారూలు సూపర్ 8 దశలోనే ఇంటిదారి పడుతుంది. ఆఫ్గానిస్థాన్ కి నెక్ట్స్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉంది. ఆ మ్యాచ్ లో ఆఫ్గాన్ గెలిస్తే చాలు కాబూలీలు సెమీస్ చేరి కంగారూలు ఇంటికిపోతారు. సో ఈ సినారియోను క్రియేట్ చేయాలి అంటే టీమిండియా ఈరోజు మ్యాచ్ లో గెలిచి తీరాలి. అయితే వర్షం అడ్డుపడే అవకాశం ఉందని అని చెప్తున్న ఈ మ్యాచ్ లు ఇరు టీమ్స్ పేపర్ మీదైతే సమ ఉజ్జీల్లా కనిపిస్తున్నాయి.