IND vs AUS  Match, IND Innings highlights: సూపర్‌ ఎయిట్‌(Super 8)లో భాగంగా ఆస్ట్రేలియా(AUS)తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా(IND) కెప్టెన్ రోహిత్‌ శర్మ( Rohit Sharma) శివాలెత్తిపోయాడు. కంగారు బౌలర్లను ఊచకోత కోశాడు. కంగారు బౌలర్లపై దండయాత్ర చేశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. రోహిత్‌ మెరుపు బ్యాటింగ్‌తో బంతి ఎక్కడ పడ్డా బౌండరీ బయటపడింది. క్రికెట్‌ బుక్‌లో చెప్పినట్లు.. భవిష్యత్‌ తరాలు సిక్సులు ఎలా కొట్టాలో నేర్చుకోవచ్చు అన్నటు రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ సాగింది. రోహిత్‌ శర్మ శతకం సాధించకపోయినా ఈ ఇన్నింగ్స్‌ మాత్రం సెంచరీ కంటే ఎక్కువే. ఎందుకంటే ఆరంభంలోనే తొలి వికెట్‌ పడిందన్న బెదురు లేకుండా... కంగారు బౌలర్లు ఒత్తిడి పెంచుతారన్న ఆందోళన లేకుండా రోహిత్‌ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 19 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌ విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో టీమిండియా కంగారుల ముందు భారీ స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ కేవలం 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 92 పరుగులు చేసి కేవలం సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో అవుటయ్యాడు. పాండ్యా, సూర్య, దూబే కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. 


 

రో హిట్‌ శర్మ

రోహిత్‌ శర్మను సిక్సర్ల కింగ్‌ అని ఎందుకు పిలుస్తారు... రోహిత్‌ అంత తేలిగ్గా బౌలర్లపై ఆధిపత్యం ఎలా ప్రదర్శిస్తారు... అసలు రోహిత్‌ను హిట్‌ మ్యాన్‌ అని ఎందుకు పిలుస్తారు.. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనతను రోహిత్‌ అంత ఎలా అందుకున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ ఎయిట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను చూడాల్సిందే. రోహిత్‌ సిక్సర్ల వర్షంతో సెయింట్‌ లూసియా తడిసి ముద్దయింది. కంగారు బౌలర్లు కంగారెత్తిపోయారు. అభిమానులు అరిచి అరిచి అలసిపోయారు. ఈ మ్యాచ్‌లో మొత్తం  41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 7 ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. రోహిత్ కొట్టిన ఒక సిక్సర్‌ అయితే ఏకంగా వంద మీటర్ల దూరంలో పడింది. అంతేనా మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అయితే రోహిత్‌ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదేశాడు. జంపాను కూడా దంచేశాడు. ఈ ప్రపంచకప్‌లో వరుస హ్యాట్రిక్‌లు తీస్తూ గొప్ప బౌలర్‌ అని భావిస్తున్న కమిన్స్‌ను కూడా ఊచకోత కోశాడు. సెంచరీ మిస్‌ అయినా రోహిత్ ఇన్నింగ్స్‌ మాత్రం శతకం కంటే ఎక్కువే. 17 ఏళ్ల క్రితం ఇంటర్నేషన్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్‌ తాను ఎంతటి విలువైన ఆటగాడినో... ఎందుకు ప్రపంచమంతా తనను గొప్ప ఆటగాడిగా పరిగణిస్తారో మరోసారి గట్టిగా చాటిచెప్పాడు. 

 

మిగిలిన బ్యాటర్లూ కూడా...

రోహిత్‌ శర్మకు మిగిలిన బ్యాటర్ల నుంచి మంచి సహకారం దక్కింది. పంత్‌ 14 బంతుల్లో 15,  సూర్య భాయ్‌ 16 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31, శివమ్ దూబే 28, హార్దిక్‌ పాండ్యా 27 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.