IND vs AUS: రెండువారాల్లో స్వదేశంలోనే మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు తమ బలాబలాలు, బలహీనతలు ఏంటి..? తుది జట్టులో ఎవరు ఉండాలి..? ఎవరి ఫిట్‌నెస్ ఎలా ఉంది..? మ్యాచ్ విన్నర్ ఎవరు..? ఆపద్బాంధవులు ఎవరు..? బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలి..? బౌలర్ల పరిస్థితి ఏంటి..? తదితర అంశాలను కూలంకశంగా తెలుసుకోవడానికి ఆఖరి మోక (అవకాశం) దొరికింది. వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈనెల 22 నుంచి 27 వరకూ జరుగబోయే ఈ సిరీస్‌లో భారత్ - ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్.. గురువారం మొహాలీ వేదికగా జరుగుతుంది.
వాళ్లకు కీలకం..
వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఇదివరకే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయినా ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత జట్టులో లోపాలు, కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు, గాయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా కప్ ఆరంభానికి ముందే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఒక్క మ్యాచ్ ఆడాడో లేదో వెన్నుగాయం తిరగబెట్టడంతో అతడు మిగతా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి అతడిని వన్డే సీరీస్‌లో ఆడిస్తారా..? లేక నేరుగా ప్రపంచకప్ లోనే పరీక్షిస్తారా..? అన్నది ఈ సిరీస్‌లో తేలనుంది. అయ్యర్‌తో పాటు అక్షర్ పటేల్ కూడా ఆసియా కప్ ఫైనల్ ముందుకు గాయపడి ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిటేషన్ పొందుతున్నాడు. అతడు మూడో వన్డేకు వరకూ ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులోకి వస్తేనే వరల్డ్ కప్ ఆడతాడు. లేకుంటే అంతే సంగతులు.. ఇక ఆటపరంగా చూస్తే శార్దూల్ ఠాకూర్, షమీలు ఆసియా కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. వాళ్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.
వీళ్లకు అవకాశం..
అసలు వన్డే ప్రపంచకప్ ప్లాన్స్‌లో లేని అశ్విన్ హఠాత్తుగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్షర్ గాయంతో సెలక్టర్లు ఇద్దరు క్రికెటర్లకు పరీక్ష పెట్టారు. వారిలో ఒకరు అశ్విన్ కాగా మరొకరు వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరిలో ఎవరు బాగా రాణించినా వాళ్లకు వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయమే. ఒకవేళ అక్షర్ కోలుకోకుంటే అది వీళ్ల నెత్తిమీద పాలు పోసినట్టే. ఇప్పటికే ఎంపికచేసిన వరల్డ్ కప్ స్క్వాడ్‌లో కుల్‌దీప్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్. అక్షర్ గనక కోలుకోకుంటే ఆ స్థానాన్ని ఈ ఇద్దరు తమిళ తంబీలలో ఎవరో ఒకరు భర్తీ చేస్తారు.
ఈ ఇద్దరితో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే ఆశలు ఇంకా ఉన్నాయి. అయ్యర్ పూర్తిగా కోలుకోకున్నా.. తిలక్‌కు మూడు మ్యాచ్‌లలో అవకాశాలు ఇచ్చి అతడు మెరుగైన ప్రదర్శనలు చేసినా అప్పుడు అతడు కూడా మెగా టోర్నీలో అవకాశం దక్కించుకోవచ్చు.
ఏ స్థానంలో ఎవరు..?
తొలి రెండు మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ, హార్ధిక్, కుల్‌దీప్‌లకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో మొహాలీలో గిల్‌తో ఓపెనర్‌గా ఎవరు వస్తారు..? అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది. గిల్‌కు జోడిగా ఇషాన్ వస్తే అప్పుడు లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కుదురుతుంది. కోహ్లీ కూడా లేడు కావున వన్ డౌన్‌లో రాహుల్ వస్తాడు. అలా కాకుండా గిల్‌తో రాహుల్ ఓపెనర్‌గా వస్తే ఇషాన్ మూడో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఇక వన్డేలలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని చేజేతులా వృథా చేసుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌లో బెంచ్ మీద కూర్చోకుండా ఫీల్డ్ లో ఉండాలంటే ఈ సిరీస్‌లో (తొలి రెండు వన్డేలకు అయితే తుది జట్టులో ఉండే అవకాశాలున్నాయి) కచ్చితంగా రాణించాలి. కానీ అతడు ఇదే ఆసీస్‌పై ఈ ఏడాది మార్చిలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడు గుండు సున్నాలు పెట్టాడు. ఆసియా కప్‌లోనూ రెండు మ్యాచ్‌లలో అవకాశమిస్తే అక్కడా విఫలమయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీ, పాండ్యాలు లేరు కావున సూర్యను నాలుగో స్థానంలో ఆడించే (అయ్యర్ ఆడకుంటే) అవకాశాలున్నాయి. హార్ధిక్ ప్లేస్‌లో రవీంద్ర జడేజా ముందుకు వస్తాడు. తిలక్ వర్మను ఆడిస్తే గనక బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయి.
బౌలర్లకు సవాలే..
ఆసియా కప్‌లోనే రీఎంట్రీ ఇచ్చిన బుమ్రాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే నిరూపించుకున్న బుమ్రా వరల్డ్ కప్‌కు పూర్తి సన్నద్ధత దక్కించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఆసియా కప్ ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసి లంక వెన్ను విరిచిన సిరాజ్ కంగారూలను కంగారెత్తిస్తే భారత్‌కు తిరుగులేదు. మునపటి లయ కోల్పోయిన షమీ ఈ సిరీస్‌లో తిరిగి ఫామ్ లోకి వస్తే భారత పేస్ ధాటిని ఎదుర్కోవడం ఆసీస్‌కు అంత వీజీ కాదు. కుల్దీప్, అక్షర్ లేకపోవడంతో తుది జట్టులో అశ్విన్, సుందర్‌లకు ఆడే అవకాశం ఉంటుంది. మూడో పేసర్‌గా షమీ వద్దనుకుంటే మాత్రం శార్దూల్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు.
ఆసీస్‌తో మొదటి వన్డేకు భారత జట్టు (అంచనా) : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్/తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ /శార్దూల్ ఠాకూర్