Rohit Sharma:  ఢిల్లీ వేదికగా శుక్రవారం భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగూరూలు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో తొలి రోజే భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. 


తొలి రోజు మొదటి సెషన్‌ నుంచే టీమిండియా ప్రత్యర్థిని కంగారు పెట్టింది. ఒకవైపు స్పిన్‌తో అశ్విన్‌ (3/57), జడేజా (3/57) ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు. మరోవైపు పదునైన పేస్‌తో మహ్మద్‌ షమీ (4/60) కంగారూల భరతం పట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (72 నాటౌట్‌; 142 బంతుల్లో 9x4) రాణించారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13 బ్యాటింగ్‌; 34 బంతుల్లో 1x4), కేఎల్‌ రాహుల్‌ (4 బ్యాటింగ్‌; 20 బంతుల్లో) నిలకడగా ఆడారు. 


ఆసక్తికరంగా రోహిత్ డీఆర్ ఎస్


రెండో టెస్ట్ మొదటి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. తొలి రోజు ఆఖరి ఓవర్ లో రోహిత్ శర్మ క్రీజులో ఉండగా నాథన్ లియాన్ బౌలింగ్ చేశాడు. లియాన్ వేసిన బంతి రోహిత్ శర్మ ప్యాడ్లను తాకి మార్నస్ లబూషేన్ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్ అవుట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ ఔటిచ్చాడు. అయితే బంతి బ్యాట్ ను తాకలేదని నమ్మకంతో ఉన్న రోహిత్ డీఆర్ ఎస్ కు వెళ్లాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ హావభావాలు అభిమానులను అలరించాయి. హిట్ మ్యాన్ డీఆర్ ఎస్ కు అప్పీల్ చేసిన విధానం మైదానంలోని ప్రేక్షకులకే కాదు వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


డీఆర్ ఎస్ ఫలితం రోహిత్ శర్మకే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి బ్యాట్ ను తాకలేదని తేలింది. అలానే ఎల్బీగా కూడా తేలలేదు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. 


ఆకట్టుకున్న ఖవాజా, హాండ్స్‌కాంబ్‌


ఒకవైపు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నా ఉస్మాన్‌ ఖవాజా మాత్రం అదరగొట్టాడు. భారత స్పిన్నర్లను తెలివిగా ఎదుర్కొన్నాడు. 71 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. వడివడిగా శతకం వైపు సాగిన అతడిని రవీంద్ర జడేజా కీలక సమయంలో పెవిలియన్‌ పంపించాడు. జట్టు స్కోరు 167 వద్ద అతడిచ్చిన క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అంతకు ముందే హెడ్‌ (12)ను షమి ఔట్‌ చేశాడు. అలెక్స్‌ కేరీ (0) యాష్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయ్యాడు.