IND vs AUS 2nd ODI:


ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు నేటి మ్యాచ్‌ ఆడటం లేదని తెలిసింది. మొహాలి నుంచి అతడు ఇండోర్‌కు వెళ్లలేదు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ముంబయికి వెళ్లినట్టు బీసీసీఐ తెలిపింది. మ్యాచ్‌ జరగడానికి గంట ముందు ట్వీట్‌ చేసింది. అతడి స్థానంలో యువ పేసర్ ముకేశ్‌ కుమార్‌ ఆడుతున్నట్టు ప్రకటించింది. బుమ్రా తిరిగి మూడో వన్డేకు జట్టుతో కలుస్తాడు.


వెన్నెముక గాయంతో జస్ప్రీత్‌ బుమ్రా ఏడాదికి పైగా టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకున్న అతడు చాలాకాలం ఇంటివద్దే విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకోగానే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడే ఫిజియోలు, వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్‌ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్‌ సిమ్యూలేషన్‌, ఫిట్‌నెస్‌ టెస్టుల్లో పాసై మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ చేశాడు. ఆసియాకప్‌లోనూ రాణించాడు.


ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 10 ఓవర్లు విసిరి కేవలం 43 పరుగులే ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు. ఆసీస్‌ను ఎక్కువ పరుగులు చేయకుండా నిలువరించాడు. ఇదే పోరులో షమి 5 వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు గానీ హఠాత్తుగా అతడు రెండో వన్డే ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. మొహాలి నుంచి ఇండోర్‌కు వెళ్లలేదని తెలిపింది. అయితే రాజ్‌కోట్‌లో జరిగే మూడు వన్డేలకు అతడు అందుబాటులో ఉంటాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ సిరాజ్‌ సైతం వస్తారు.


కొన్ని రోజుల క్రితమే జస్ప్రీత్‌ బుమ్రా తండ్రయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో  ఆసియా కప్  - 2023 ఆడేందుకు శ్రీలంకకు వెళ్లి శనివారం  పాకిస్తాన్‌తో  జరిగిన మ్యాచ్ తర్వాత  ఆదివారం ఉన్నఫళంగా బుమ్రా ఉన్నఫళంగా ముంబయికి వచ్చిన విషయం తెలిసిందే.


పేరు అంగద్ బుమ్రా.. 


బుమ్రా - సంజనాలు తమ కుమారుడికి ‘అంగద్’గా నామకరణం చేశారు.  ‘మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి. ఈ (సోమవారం) ఉదయం  మా అబ్బాయి అంగద్ జస్ప్రిత్ బుమ్రాను ప్రపంచలోకి  స్వాగతించాం.  మేము  ప్రస్తుతం అత్యంత సంతోషంగా ఉన్నాం. మా జీవితాలలో ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు  వచ్చే ప్రతీదానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ  బుమ్రా ట్విటర్ వేదికగా ప్రకటించాడు.


మొదటి వన్డే వివరాలు


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71: 77 బంతుల్లో, 10 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (74: 63 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించారు. కేఎల్ రాహుల్ (58 నాటౌట్: 63 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (50: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో షమి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.